midhunam
-
ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనని ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) వంగపండు నా అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు, పాడారు, నటించారు. తర్వాత కూడా నా అనేక చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. (వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం) ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ఉత్తరాంధ్రకు తీరని లోటని మిధునం సినిమా నిర్మాత ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. అతని పాట వింటే ఊపు వస్తుందని..పేద ప్రజల గుండెచప్పుడు ఆ పాటలో కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పాట రూపంలో ఓదార్చిన వ్యక్తి వంగపండు. అలాంటి ప్రజా గాయకుడు మళ్ళీ ఈ తరంలో కనిపిస్తారా. తన చిన్నతనంలో వంగపండు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందేవాడినని నిర్మాత ఆనంద రావు అన్నారు. -
ఇదొక పండగ... ఈవెంట్
శ్రీరమణ.. పరిచయం అక్కర్లేని పేరు. ‘మిథునం’ కథా రచయితగా... రాజకీయాలపై ‘అక్షర తూణీరం’ పేరున సంధిస్త్తున్న వ్యంగ్య వ్యాసాల రచయితగా.. ప్రముఖ సంపాదకుడిగా అందరికీ సుపరిచితులు. విజయవాడలో జరుగుతున్న 27వ పుస్తక ప్రదర్శనకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలు పంచుకున్నారు. ఆ వివరాలు.. ఏ మార్పూ లేదు పుస్తక మహోత్సవం ప్రారంభమైన నాటి నుంచి.. అంటే 27 ఏళ్లుగా నేను బుక్ ఎగ్జిబిషన్‌కు వస్తున్నా. ప్రదర్శన మొదట్లోనే పెద్దస్థాయిలో ప్రారంభమైంది. మొదటి సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అదే స్థలంలో కొనసాగుతోంది. గతంలో కోల్‌కతా బుక్ ఫెస్టివల్‌కు ఎక్కువగా వెళ్తుండేవారు. కంప్యూటర్, ఇంటర్నెట్ లేనిరోజుల్లో ఆంగ్ల పుస్తకాల కోసం కోల్‌కతానే వెళ్లాల్సి వచ్చేది. విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలైన తర్వాత ఇంగ్లిష్ పుస్తకాల స్టాల్స్ వచ్చాయి. ఈ ప్రదర్శన కోల్‌కతా స్థాయిని దాటిపోయింది. హైదరాబాద్, మద్రాస్ నగరాల్లోనూ బుక్ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. విజయవాడలో జరగటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారికి ఇదొక పండుగలా, ఈవెంట్‌లా అనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాల వారు ఏడాదిపాటు డబ్బులు దాచుకుని ప్రదర్శన ప్రారంభం కాగానే పుస్తకాలు కొంటున్నారు. సకుటుంబ సపరివారంగా.. చాలామంది ముందుగా ఈ ప్రదర్శనకు వచ్చి ఎగ్జిబిషన్ అంతా తిరిగి ఏయే స్టాల్లో ఏయే పుస్తకాలు ఉన్నాయో చూసి రెండోసారి వచ్చి పుస్తకాలు కొంటున్నారు. వచ్చిన వాళ్లెవరూ ఉత్తి చేతుల్తో వెళ్లడం నేను చూడలేదు. నిఘంటువుల వంటి ఖరీదైన పుస్తకాల మీద వచ్చే పదిశాతం డిస్కౌంట్ వారికి ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా ఏ ప్రదేశానికీ సకుటుంబంగా వెళ్లడం సాధ్యపడదు. అటువంటిది ఇక్కడకు సకుటుంబంగా వస్తారు. సీనియర్ సిటిజన్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఏనాడో కలుసుకున్న పాత మిత్రులను ఇక్కడ కలుస్తుంటాను. కళా వేదికలు ప్రత్యేకం పుస్తక ప్రదర్శనలోని వేదికలకు సాంస్కృతిక, సాహిత్య రంగాల్లోని ప్రముఖుల పేర్లు పెట్టడం ప్రత్యేకం. మాలతీ చందూర్, బాపురమణలు, చలసాని ప్రసాద్... ఇలా పలువురు ప్రముఖుల పేర్లు పెట్టి వారిని స్మరించడం ఒక మంచి పని. ఇది కేవలం పుస్తక వ్యాపారం మాత్రమే కాదు. పుస్తకాలకు సంబంధించి ఇదొక స్పృహ. ఇలా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడమంటే మంచి వాతావరణం కల్పించడమే. బాలసాహిత్యం భేష్ నేను గమనించినంత వరకూ ఈ సంవత్సరం బాలసాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు ఆదరణ అధికంగా ఉంది. గతంలో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఎక్కువగా కొనేవారు. ఇప్పడు బాలసాహిత్యానికి ఆదరణ రావడం ఆనందంగా ఉంది. పిల్లల కోసం కథలు రాయగలిగిన రచయితలు ఇప్పుడు మళ్లీ మరిన్ని పుస్తకాలు రాస్తారనిపిస్తోంది. బాపురమణలు మద్రాసులో ఉన్నా వీలు చేసుకుని తప్పనిసరిగా ఇక్కడకు వచ్చేవారు. ఓ సంవత్సరం బాపురమణలను వేదిక పైకి పిలిచారు. ‘మేం వేదికలు ఎక్కమని తెలుసు కదా..’ అని వారు సమాధానం ఇచ్చారు. వేదిక కిందే కూర్చుని సమాధానాలు చెప్పమని దగ్గరుండి నేను, జంపాల చౌదరి ప్రేక్షకులతో ముఖాముఖి ఏర్పాటుచేశాం. చాలా సరదాగా సమాధానాలు చెప్పారు. నాకు ఇటువంటి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదో ఈవెంట్ ఎప్పుడు బుక్ ఎగ్జిబిషన్ వ చ్చినా ఎటువంటి కొత్త పుస్తకాలు వచ్చాయా అని చూడటం నాకు అలవాటు. పుస్తక ప్రదర్శన అనేది విజయవాడను గుర్తుపెట్టుకునే పెద్ద ఈవెంట్. 27 ఏళ్లుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు.