నర్సాపూర్ పోస్టాఫీసులో చోరీ
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోస్టాఫీసులో దొంగలు చొరబడి కొంత నగదు, స్టాంపులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పోస్టాఫీసు వెనుక వైపు గల ప్రహారీ నుంచి దిగి తలుపులు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. ఈ సందర్భంగా రూ. 19 వేల 750 చినిగిన నోట్లు భద్ర పరిచిన బాక్స్‌ను ఎత్తుకెళ్లగా మరో బాక్స్‌ను ధ్వంసం చేసి రూ. 5,600 నగదును తీసుకెళ్లారు. దీంతో పాటు రూ.740 విలువ గల రెవెన్యూ స్టాంపులు, రూ. 6,370 పోస్టల్ స్టాంపులతో పాటు సుమారు రూ.74 వేల విలువ గల సేవింగ్ బాండ్లను ఎత్తుకెళ్లారు.
ఉదయం స్వీపర్ పాష డోరు తాళాలు తీసి కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు ఉపక్రమించిగా వెనుక డోర్లు తెరుచుకుని ఉండడాన్ని గమనించి పోస్టుమాస్టర్ రాంకుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆయన పోస్టాఫీసుకు చేరుకుని పోయిన వస్తువులను పరిశీలించి వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పోస్టాఫీసును పరిశీలించారు.
పోస్టాఫీసును పరిశీలించిన సూపరింటెండెంట్
చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న సంగారెడ్డి హెడ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ జనార్దనరెడ్డి ఇతర సిబ్బంది స్థానిక పోస్టాఫీసుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.