సిట్ కస్టడీకి కమింగ
- మూడు రోజులపాటు ప్రశ్నించనున్న అధికారులు
- డ్రగ్స్ దందాలో టెక్కీల సంగతి తేల్చడంపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి సరఫరా చేసినట్లుగా ఆరోపణలున్న నెదర్లాండ్స్ ఐటీ నిపుణుడు మైక్ కమింగను సిట్ అధికారులు 3 రోజులపాటు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా కమింగ ఉన్నాడని, అతడి నుంచి సమాచారం సేకరించాల్సి ఉందని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనికి అనుమతించిన మియాపూర్ కోర్టు.. శుక్రవారం నుంచి 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. మైక్ కమింగ సీనియర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలర్ నిపుణుడిగా పేరు పొందాడు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు.
హైదరాబాద్‌తోపాటు ముంబై, పూణెలలో కార్యాలయాలు కూడా ఉన్నాయి. దీంతో కమింగకు భారీ స్థాయిలో నెట్వర్క్ ఉందని.. వృత్తిని అడ్డుగా పెట్టుకుని డ్రగ్స్ దందా చేశాడని సిట్ అనుమానిస్తోంది. కమింగ ఫోన్లో 2 వేలకు పైగా టెక్కీల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి సినీ ప్రముఖుల విచారణ సమయంలోనే ఆరుగురు సాప్ట్వేర్ ఇంజనీర్లను ప్రశ్నించిన సిట్.. మైక్ కమింగను అరెస్ట్ చేసింది. అతడి నుంచి 2.8 డీఎంటీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ అలవాటు చేసినట్లుగా పలు ఆధారాలు కూడా సంపాదించింది. తాజాగా కస్టడీలో లోతుగా ప్రశ్నించి డ్రగ్స్ లింకును ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నమే కమింగను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.