చర్మకాంతికి 5 ప్యాక్స్...
చర్మానికి మేలు చేసే గుణాలు ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలలో పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొన, పాలు, బాదంపప్పు, తేనె, నిమ్మరసం, క్యారట్లతో చర్మకాంతిని పెంచుకోవచ్చు.
ఎగ్ ప్యాక్: టీ స్పూన్ గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలో వేసి, అందులో అర టీ స్పూన్ పాల మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి పెరుగుతుంది.
పాలు: ముందు రోజు రాత్రి ఐదు బాదంపప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే పై పొట్టు తీయాలి. వీటిని మెత్తగా రుబ్బి, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని వదలగొట్టి, చర్మకాంతిని పెంచుతాయి. బాదం పప్పు లోని సహజమైన నూనెలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి.
తేనె: టేబుల్ స్పూన్ తేనెలో అరముక్క నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి, 10 -15 నిమిషాలు ఉండాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మంపై మలినాలను తొలగించడంలో మైల్డ్ ఫేస్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. కాంతి పెరుగుతుంది.
క్యారెట్: బంగాళదుంప, క్యారెట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు బేకింగ్ సొడా, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకొని రెండు నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
రోజ్‌వాటర్: రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక చుక్క గ్లిజరిన్, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది ఉండతో అద్దుకుంటూ ముఖం, మెడకు రాసి, తుడవాలి. ఇది రోజంతా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం నివారిస్తుంది. చర్మం ముడతలు తగ్గి, యవ్వనకాంతితో మెరుస్తుంది.