military area
-
‘ఆర్మీ డే’ వేడుకలకు అతిథిగా ఏడున్నరేళ్ల న్యోరా
సాక్షి, కంటోన్మెంట్ (హైదరాబాద్): ఓ చిన్నారికి ప్రధానమంత్రి కార్యాలయం మరచిపోలేని బహుమతిని అందజేసింది. మన ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించింది. సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఆర్మీ డే వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. చిన్నారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. వివరాలు... నగరానికి చెందిన సమీర్ పాత్ర, వర్ష పాత్రల కుమార్తె న్యోరా పాత్ర గతేడాది రిపబ్లిక్ డే వేడుకలను టీవీల్లో చూసి ఆర్మీ పట్ల అభిమానాన్ని పెంచుకుంది. ఆర్మీ దుస్తులు ధరించి తనను తాను సైనికురాలిగా ఊహించుకునేది. ఆర్మీకి సంబంధించి వందలాది పెయింటింగ్‌లు వేస్తూ గడిపేది. అంతటితో ఆగకుండా తాను ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ వచ్చింది. తల్లిదండ్రులు ఆమె కోరికను వ్యక్తపరుస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ మెయిల్స్, లేఖలు రాశారు. న్యోరాకు ఇండిపెండెంట్ డే లేదా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పీఎంవో ఆదేశాల మేరకు శుక్రవారం జరిగిన ఆర్మీ డే, ఆర్మీ వెటరన్స్ డే వేడుకలకు ఆర్మీ అధికారులు న్యోరాను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. కల్నల్ ర్యాంకు అధికారి, ఇద్దరు సోల్జర్స్ ఆధ్వర్యంలో న్యోరాకు భద్రత కల్పిస్తూ ఆమెను సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక స్మారకం వార్ మెమోరియల్‌కు తీసుకొచ్చారు. ఓ యువరాణిలా న్యోరాను గౌరవిస్తూ ఆప్యాయ పలకరింపులు, ఆమెతో ఫొటోలు దిగుతూ మరింత ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా న్యోరాతో కలసి ఆర్మీ ఉన్నతాధికారులు అమరవీరులకు సైనిక వందనం సమర్పించారు. -
ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదు
తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలకు గురై మృతి చెందిన ముస్తఫా (11)పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. అందులో ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదని తేలింది. ఈ నెల 8న మిలటరీ ఎక్యుప్మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో కేసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పక్షం రోజుల క్రితం ఏర్పాటు చేశారు. సిట్ బృందం ఇప్పటికే ఎనిమిది మంది మిలటరీ జవాన్లను, చుట్టుపక్కల ఉన్న దుకాణాల యజమానులను విచారించింది. అగ్గిపెట్టెను ముస్తఫానే ఖరీదు చేశాడు.. ఘటనకు ముందు ముస్తఫా స్వయంగా తన దుకాణానికి వచ్చి రెండు అగ్గిపెట్టెలు, రెండు చాక్లెట్లు ఖరీదు చేశాడని ఓ దుకాణ యజమానురాలు సిట్ అధికారులకు తెలిపింది. ఆ సమయంలో ముస్తఫా ఒక్కడే దుకాణానికి వచ్చాడని, తన దుకాణానికి వచ్చిన 15 నిముషాలకే ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె వెల్లడించింది. అయితే నీలి కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం నేటికి తెలియరాలేదు. సిద్ధికీనగర్తో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో బ్లూ కిరోసిన్ విక్రయించే కిరాణా షాప్ యజమానులను సైతం పోలీసులు విచారించినా ఫలితం దక్కలేదు. బ్లూ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తులిస్తే కేసు కొలిక్కి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
అది నీలి కిరోసిన్...
ముస్తఫా కేసు దర్యాప్తు ముమ్మరం ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించిన ‘సిట్’ సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలతో మృతి చెందిన ముస్తఫా (11) ఉదంతంపై నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులకు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించాయి. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం ఘటన జరిగిన మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాను నగర సీసీఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులతో పాటు మిలటరీ అధికారులు మరోసారి సందర్శించి వివరాలు సేకరించారు. ముస్తఫా హత్యకు గురై ఉంటే అందుకు కార ణాలేమిటి? అనే కోణంలో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఘటన జరిగిన రోజే డాగ్‌స్క్వాడ్ ముస్తఫా మృతదేహం పడిన చోటి నుంచి మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్ లోపల ధోబీరూమ్ వద్ద ఉన్న బాత్రూం వద్దకు (ఇక్కడే ముస్తఫా ఒంటికి మంటలంటుకున్నాయి) వెళ్లింది. బాత్రూం నుంచి ముస్తఫా పడిన చోటికి, అక్కడి నుంచి బాత్రూమ్ వరకు ఇలా ఐదుసార్లు పోలీసు శునకం వెళ్లొచ్చింది. అది మరోచోటికి వెళ్లకుండా ముస్తఫా వద్దకే వచ్చి ఆగిందంటే ఘటన ప్రారంభమైన ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నాడా?.. ఉంటే అతను పారిపోయి ఉంటే అటు వైపు డాగ్ ఎందుకు వెళ్లలేదు. అనే ప్రశ్నలు పో లీసులను వేధిస్తున్నాయి. బయట నుంచే కిరోసిన్ తెచ్చారా? ముస్తఫా ఒంటిపై పడింది బ్లూ కిరోసినేనని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులూ గుర్తించారు. క్లూస్ టీం కూడా ఘటన జరిగిన సమయంలో ధోబీరూమ్ పక్కనే బాత్రూమ్ ముందు పడిఉన్న (అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్)బాటిల్లో ఉన్న నీలి రంగు కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్‌ను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు కూడా పంపిచారు. అయితే ఈ కిరోసిన్ ఘటనా స్థలానికి ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. తెల్ల కిరోసిన్ అయితే ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అదే నీలి రంగు (ప్రభుత్వం దీన్ని సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది) కిరోసిన్. మిలటరీ సిబ్బందికి ఈ కిరోసిన్ సరఫరా కానేకాదు. వారి క్వార్టర్స్‌లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లే ఉన్నాయి. ఇక సైనికుల దుస్తులు ఇస్తిరీ చేసే ధోబీరూమ్లో కూడా ఎక్కడా కిరోసిన్ ఉన్న దాఖలాలు లేవు. బొగ్గుల పెట్టేతో ఇస్తిరీ చేస్తే బొగ్గులకు నిప్పంటించేందుకు కిరోసిన్ వాడతారు. అయితే ఇక్కడ కరెంట్ పెట్టెతో ఇస్తిరీ చేస్తున్నారు కాబట్టి కిరోసిన్ అవసరం లేదు. అలాగే ధోబీ రూమ్ చుట్టుపక్కల ఎక్కడా బొగ్గులు కాని, కాలిన బొగ్గు బూడిద కాని కనిపించలేదు. అలాగే మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్‌లోని ఐదు గదులను కూడా మిలటరీ అధికారుల సహకారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ గదులలో కూడా ఎక్కడా కిరోసిన్ పెట్టిన ఆనవాళ్లు లేవు. దీంతో ఈ నీలిరంగు కిరోసిన్ మిలటరీ ఏరియాకు బయటి నుంచే వచ్చి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడితే ముస్తఫా మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు. ఘటన స్థలంలో కాలిపోయిన చిన్నపాటి చెట్ల ఆకులతో పాటు కిరోసిన్ పడిన ఆకులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ ఆకులపై పడింది కూడా నీలిరంగు కిరోసినేనని తేలింది. -
కొలిక్కిరాని ముస్తఫా హత్య కేసు
ఘటనా స్థలంలో లభించిన అగ్గిపెట్టె, చాక్లెట్లు వీటిని ఖరీదు చేసిన వ్యక్తి గురించి ఆరా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు కిరోసిన్ సాక్షి, సిటీబ్యూరో: మెహదీపట్నం మిలటరీ ఏరియాలో హత్యకు గురైన ముస్తఫా (11) కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కిరాలేదు. దర్యాప్తునకు కావాల్సిన వస్తువులు కొన్ని పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగానే దర్యాప్తును సాగిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదిస్తామని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తుకు సైనికాధికారులు కూడా పూర్తి గా సహకరిస్తున్నారిని ఆయన తెలిపారు. ఈ నెల 8న ముస్తఫా కాలిన గాయాలకు గురై, మరుసటి రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఘటనా స్థలాన్ని మిలటరీ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులే కేసు పురోగతికి కీలకం కానున్నాయి. సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాలోనే... మెహదీపట్నం మిలటరీ ఏరియాలో మిలటరీ సిగ్నల్ వ్యవస్థ పరికరాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఐదు గదులు దూరం దూరంగా కట్టి ఉన్నాయి. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ గదుల చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో పహరీ గోడలు, ఆపై నాలుగడుగుల ఇనుప సీకులతో కంచె ఉంది. లోపల ఓ మూలన వేరుగా బాత్రూమ్, వీటి పక్కనే మరో ధోబీ రూమ్ ఉన్నాయి. ఆ గదులలో మిలటరీ సిబ్బందికి సంబంధించిన సామాగ్రి భద్రపరుస్తారు. పది అడుగులతో ప్రధాన గేటు, దానికి ఆనుకుని మూడడుగుల వెడల్పుతో మరో చిన్నగేటు ఉంది. గేటు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. గేటు కింది నుంచి ఎవరైనా లోపలికి దూరే అవకాశం ఉంది. బాత్రూమ్ వద్దే మంటలు.. బాత్రూమ్ గోడకు అనుకుని ఉన్న సమయంలోనే ముస్తఫా ఒంటిపై కిరోసిన్ పడింది. అక్కడ ఉన్న చిన్న నీటి గుంటలో కిరోసిన్ పడిన దాఖలాలు ఉన్నాయి. ముస్తఫా చెప్పులు కూడా అక్కడే పడి ఉన్నాయి. బాత్రూమ్కు ఐదడుగుల దూరంలో పుల్లల డబ్బి లభించింది. మూడడుగుల దూరంలో చాక్లెట్ కవర్ కూడా లభించింది. పదడుగుల దూరంలో విసిరేసినట్లుగా అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ఇందులో ఐదు మిల్లిలీటర్ల కిరోసిన్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. బాత్రూమ్ వద్దే ముస్తఫాకు నిప్పంటుకుంది. 50 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి... కాలుతున్న మంటల్లోనే ముస్తఫా అక్కడి నుంచి 40 మీటర్ల దూరం వరకు ఉన్న ప్రధాన గేటు వరకు వచ్చాడు. చిన్నపెద్దగేటు రెండు కూడా తాళాలు ఉండడంతో గేటు కింది నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చి మరో 10 మీటర్ల దూరం వరకు (సిద్దిఖీనగర్ వైపు) వెళ్లి తారు రోడ్డుపై పహరీ గోడకు మూడు అడుగులో దూరంలో కుప్పకూలిపోయాడు. మరో 30 మీటర్ల దూరం వెళితే సిద్దిఖీనగర్ బస్తీకి వేసిన మిలటరీ కంచె దాటే అవకాశం ఉంది. ఇవే కీలక ఆధారాలు... ఘటనా స్థలంలో లభించిన పుల్లల డబ్బి (జోకర్ కంపెనీ), చాక్లెట్ కవర్ (కోజ్కో కంపెనీ)లు సిద్దిఖీనగర్‌లోని ఓ చిన్నపాటి కిరాణా షాప్‌లోంచి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే పథకం ప్రకారమే అదే రోజు ఈ రెండు వస్తువులు షాప్‌లో ఖరీదు చేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే వాటిని ఎవరు ఖరీదు చేశారు అనే కోణంపై ఆరా తీస్తున్నారు. ముస్తఫా మంటల్లో కాలుతున్న సమయంలో అతడి ఒంటిపై 450 మిల్లీలీటర్ల కిరోసిన్ పడిందని. ఘటనా స్థలంలోని మురికి నీళ్లు, గడ్డిలో 45 మిల్లీలీటర్ల వరకు కిరోసిన్ పడిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. కేవలం బాటిల్లో ఐదు మిల్లీలీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలిఉంది. దూరంగా విసిరేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్‌కు మూత పెట్టలేదు, మూత మరో దిక్కున పడి ఉంది. ఈ కిరోసిన్ షాంపిల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చింది. అనే విషయంపై ఆరా తీస్తున్నారు.కిరోసిన్ ఎక్కడిదనేది చెప్పగలిగితే కేసు మిస్టరీ వీడుతుందని అధికారులు అంటున్నారు. సమగ్ర విచారణ జరపాలి సాక్షి,సిటీబ్యూరో: మదర్సా విద్యార్థి ముస్తఫా మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మెనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ శనివారం కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్, ఆర్మీ ప్రతినిధి అనుపమ శర్మ, పీర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ముస్తఫాకు నివాళి.. గోల్కొండ: షేక్ ముస్తఫా హత్యపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ చైర్మన్ మహ్మద్ నజీబ్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం టోలీచౌకీలోని ఐహెచ్‌ఆర్‌ఓ కార్యాలయంలో షేక్ ముస్తఫా మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ ముస్తఫాది హత్యేనని ఆయన అన్నారు. మిలటరీ జవాన్లే కిరోసిన్ పోసి నిప్పంటించారని షేక్ ముస్తఫా వాగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని అన్నారు. సయ్యద్ సుల్తానా, సమీర్, నాగిరెడ్డి, ముస్తఫా పాల్గొన్నారు.