పోలీసులపై మిలటరీ సిబ్బంది దౌర్జన్యం?
బొల్లారంలో సంచలనం
బొల్లారం: రాత్రి పూట కారు ఆపి ఇక్కడ మద్యం తాగుతున్నారేంటి? అని ప్రశ్నించిన పాపానికి గస్తీలో ఉన్న పోలీసులపై మిలటరీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు... రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి బొల్లారం పోలీసులు స్థానిక మిలటరీ ఏరియాలో గస్తీకి వెళ్లారు. మిలటరీ ఆఫీసర్స్ మెస్ వద్ద కొందరు వ్యక్తులు కారు ఆపి మద్యం తాగుతున్నారు. ఇది గమనించిన పోలీసులు మిలటరీ ఏరియాలో మద్యం తాగున్నారేంటి? అని ప్రశ్నించి వారి ఫొటోలు తీయబోయారు.
అంతలోనే మద్యం మత్తులో ఉన్న సుబేదార్ స్థాయి అధికారి పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తమ సిబ్బందిని అక్కడి పిలిపించాడు. వచ్చి రాగానే వారు పోలీసులపై దౌర్జన్యం మొదలె ట్టారు. పోలీసులు వారి నుంచి తప్పించుకొనేందుకు యత్నించినా వెంటబడి మరీ తరిమికొట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులకు తీవ్రగాయాలైనట్టు సమాచారం.
కాగా, తమ తప్పు తెలుసుకున్న మిలటరీ అధికారులు శనివారం ఉదయం పోలీసుస్టేషన్‌కు వచ్చి తమను క్షమించాలని పోలీసు అధికారులను, గాయపడ్డ పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని ఇటు పోలీసులు, అటు మిలటరీ అధికారులు గోప్యం ఉంచడటం గమనార్హం. గతంలో తిరుమలగిరి, కార్కాన తదితర ఠాణాల పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగాయి. పోలీసులు కేసులు నమోదు చేయకుండా సర్ధుకుపోవడం జరుగుతోంది.
సీఐ వివరణ: బొల్లారం సీఐ జగన్‌ను ఈ విషయమై వివరణ కోరగా... ‘అంతా మన వాళ్లే అంటూ’ విషయం దాట వేయడం గమనార్హం.