గతి తప్పిన విమానాలు.. ఘోరప్రమాదాలు
- ఇండోనేసియాలో ఇంట్లోకి దూసుకెళ్లిన సైనిక విమానం.. ముగ్గురి మృతి
- సైనిక విమానం కూలి నలుగురు సైనికుల దుర్మరణం
మలాంగ్/ నైపిడా: ఆగ్నేయ ఆసియా దేశాలైనా ఇండోనేసియా, మయన్మార్ లలో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇరు దేశాల్లోనూ కుప్పకూలినవి సైనిక విమానాలే కావడం గమనార్హం. రెండు దేశాల్లో కలిపి ఐదుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు.
ఇండోనేసియా జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు.
మయన్మార్ ప్రమాదం: సాధారణ పరీక్షల నిమిత్తం ఐదుగురు సైనికులు ఒక చిన్న తరహా విమానంలో రాజధాని నైపిడాలోని ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగి ఎయిర్ బేస్ కు సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు సైనికుల్లో నలుగురు మంటలల్లో కాలిపోగా, ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్టు అధికారులు చెప్పారు. మయన్మార్ పూర్తిగా కొండప్రాంతం కావడంతో భూతర రవాణా సౌకర్యాలు తక్కువ. దీంతో సాధారణ ప్రయాణికులు కూడా విమాన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అక్కడ తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి.