చైనాపై ట్రంప్ గరంగరం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనా అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకోవడం, అది అనుసరిస్తున్న మిలిటరీ పాలసీలపై ట్రంప్ ట్విట్టర్లో వ్యతిరేకత వ్యక్తం చేశారు.
అమెరికా కంపెనీలకు తీవ్ర పోటీ ఎదురయ్యేలా చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకోవడం, చైనా ఉత్పత్తులపై అమెరికా పన్ను వేయనప్పటికీ.. అమెరికా నుంచి అక్కడికి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై ఎక్కువ పన్ను వేయడం, దక్షిణ చైనా సముద్రంలో భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించడం లాంటి చర్యలు సరైనవి కావని ట్రంప్ పేర్కొన్నారు.
తైవాన్ ప్రెసిడెంట్‌తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరపడంపై ఇటీవల చైనా మండిపడిన విషయం తెలిసిందే. సయ్ ఇన్ వెంగ్‌తో ట్రంప్ సంభాషణ జరపడం ట్రంప్ అనుభవరాహిత్యాన్ని సూచిస్తుందని చైనా మీడియా విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో.. చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.