మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు
రాజమహేంద్రవరం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన భూగర్భ జలాలు, మైన్స్ శాఖ ఏడీ రౌతు గొల్ల కేసు విచారణలో అనేక ఆస్తులు బయట పడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడిలో శుక్రవారం ఏడీ రౌతు గొల్ల పట్టుబడిన విషయం విదితమే.
రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన తాళ్ల చిరంజీవిరావు 7.50 ఎకరాల భూమిని గ్రావెల్ తవ్వుకునేందుకు లీజుకిచ్చే విషయంలో ఎకరానికి రూ.15 వేల చొప్పన రూ.1.50 లక్షలు లంచం అడిగారు. ఈ నేపథ్యంలో రైతు చిరంజీవిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రూ.75 వేలకు బేరం కుదిర్చి, ఏడీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేరోజు ఏడీ ఇంటి వద్ద సోదాలు చేయగా, రూ.4.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో ఉన్న ఏడీ ఇంట్లో లాకర్ తాళం స్వాధీనం చేసుకున్నారు. ఈ లాకర్‌ను సోమవారం తెరవగా, అందులో 1,100 గ్రాముల బంగారం, విజయ వాడలో రెండు ఇళ్లకు సంబంధించిన పత్రాలు, రెండు భూములకు సంబంధించిన పట్టాలు లభ్యమయ్యాయి. అలాగే ఏడీ సొంత గ్రామమైన శ్రీకాకుళంలో అర ఎకరం భూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.