బీబీఎల్ లో తొలి చైనీ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ 20 బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో తొలిసారి చైనా క్రికెటర్ పాల్గొంటున్నాడు. ఈ సమ్మర్ సీజన్ లో జరిగే బిగ్ బాష్ లీగ్ లో చైనాకు చెందిన మింగ్ లీ ఆడనున్నాడు. ఈ మేరకు మింగ్ ను సిడ్నీ సిక్సర్స్ కొనుగోలు చేసింది. అంతకుముందు 2004 లో హాంకాంగ్ తరపున మింగ్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. తాను క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ స్ఫూర్తి అని మింగ్ తెలియజేశాడు. వార్న్ వీడియోలను యూట్యూబ్ లో తరచు చూస్తూ ప్రేరణ పొందేవాడేనని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చిన సీఏకు, హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి బిగ్ బాష్ లీగ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా క్రికెట్ ఆటలో లింగ్ కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని సిడ్నీ సిక్సర్స్ మేనేజర్ డొమినిక్ రేమాండ్ తెలియజేశాడు. తాము హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్ కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.