నియోజకవర్గానికో అగ్నిమాపక కేంద్రం
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. కాటన్, జిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి.. పత్తి రైతులు, మిల్లు యజమానులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు రెండు నుంచి మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ వాటర్ టెండర్(మిస్ట్) వెహికల్స్ను ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారు.
అందుకే భారీగా నిధులు ఇచ్చి ఆధునాతన పరికరాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా అపార్ట్మెంట్లోలకి వెళ్లేందుకు భారీ నిచ్చెనలు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. 119 అగ్నిమాపక కేంద్రాలు అవసరముండగా 100 వరకు మంజూరు అయ్యాయి. గతంలో 94 ఉన్న ఈ కేంద్రాలను మరో ఆరింటికి పెంచారు. ఈ బైక్లను నడిపేందుకు ప్రొఫెషనల్ డ్రైవర్లు అవసరం లేదని, అందుబాటులో ఉన్న సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే మినీ వాటర్ టెండర్ వెహికల్స్పై వెళ్లి అగ్ని కీలలను అదుపులోకి తీసుకరావచ్చని హోం కార్యదర్శి అనితా రాజేందర్ అన్నారు. గతేడాది హైదరాబాద్లో పరిచయం చేసిన 19 మినీ ఫైర్ టెండర్ వెహికల్స్ వల్ల మంచి ఫలితాలు రావడంతో ఈ విధానాన్ని రాష్ట్రమంతటికీ అమలుచేస్తున్నామని తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్ అన్నారు.