సర్వేపల్లి కాలువ కబ్జా
సాక్షి, నెల్లూరు : సోమశిల రిజర్వాయర్ పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సర్వేపల్లి కాలువ కబ్జాకు గురైంది. దీంతో ఈ కాలువ రోజురోజుకూ కుంచించుకుపోతోంది. నెల్లూరు పెన్నానది నుంచి నగరంలో 10 కిలోమీటర్లకు పైగా పొడవు ఉన్న ఈ కాలువ దాదాపు కనుమరుగు అయ్యేంతగా కబ్జా కోరల్లో చిక్కుకుంది.
నగర పరిధిలో రంగనాయకులపేట నుంచి శెట్టిగుం టరోడ్డు, ఆత్మకూరు బస్టాండ్, బాలాజీనగర్, మినీబైపాస్ రోడ్డు, కొండాయపాళెం, కనుపర్తిపాడు, వెంకటాచలం మీదుగా ఈ కాలువ సర్వేపల్లి వరకూ సాగుతుంది. అయితే రంగనాయకులుపేట మొదలు కొండాయపాళెం, కనుపర్తిపాడు వరకూ కాలువ ఆక్రమణకు గురైం ది. ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ నుంచి బాలాజీనగర్, మినీబైపాస్ రోడ్డులోని ఈ ప్రధాన కాలువను పెద్ద ఎత్తున ఆక్రమించారు.
ఈ ప్రాంతంలో అధికార పార్టీ అండతో కబ్జాదారులు ఏకంగా కాలువలోనే పిల్లర్స్ వేసి బహుళ అంతస్తుల భవనాలు సైతం నిర్మించారు. మరికొందరు చిన్నపాటి ఇళ్లు నిర్మించి బాడుగలకు ఇస్తుండగా, మరికొందరు వాటిని అమ్మకానికి పెట్టి అందిన కాడికి దండుకొని చేతులు దులుపుకున్నారు.
మరికొందరు ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు. ఆక్రమణల వెనక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతోపాటు కొందరు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. నగరంలో విలువైన స్థలం కావడం, శ్రమ లేకుండానే కోట్లాది రూపాయలు కొల్లగొట్టే అవకాశం ఉండటంతో నేతలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. అధికార బలంతో ఆక్రమణలు పెరగడంతో పలు ప్రాంతాల్లో కాలువ మరింత కుంచించుక పోయింది. కొన్నిచోట్ల ప్రధాన కాలువ పిల్లకాలువలాగా, మరి కొన్నిచోట్ల చిన్నపాటి డ్రైనేజీలాగా మారిపోయాయి. సోమశిల నీళ్లు విడుదల చేసినా సక్రమంగా ఆయకట్టుకు నీరుచేరే పరిస్థితి లేదు. నీళ్లు రాకపోతే పంటలు సక్రమంగా పండే అవకాశం లేదు.
దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కాలువలో పూడికతీత అంటూ అటు అధికారులు, కాంట్రాక్టర్లు అందిన కాడికి దండుకున్నారే తప్ప ఆక్రమణలు తొలగించి కాలువను విస్తరించడాన్ని గాలికొదిలారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లుతెత్తుతున్నాయి. కాలువల ఆక్రమణలతో పాటు నాసిరకంగా జరుగుతున్న పూడికతీత పనులు ఇటీవల కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇరిగేషన్ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఈ నెల 15న ఐఏబీ సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు కాలువల ఆక్రమణల సంగతి అధికారుల దృష్టికి తెచ్చారు.
కలెక్టర్ సీరియస్‌గా స్పందించినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా స్పందించి సర్వేపల్లి కాలువతో పాటు నగర పరిధిలో నెల్లూరు చెరువు, పెన్నాడెల్టా, ఈస్ట్రన్, సదరన్, జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి తదితర నీటిపారుదల శాఖకు సంబంధించి కాలువలున్నాయి. పెన్నాడెల్టాకు సంబంధించి 22 మీడియం కెనాల్స్, నాలుగు ప్రధాన కాలువలున్నాయి. సదరన్ చానల్‌కు సంబంధించి 26 కాలువలు ఉండగా జాఫర్ సాహెబ్ కెనాల్‌కు 38 కాలువలు,సర్వేపల్లి కెనాల్ పరిధిలో 34 కాలువలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. తక్షణం ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.