సుజయ్‌కు సవాళ్లే!
► మైనింగ్ చుట్టూ మాఫియా వివాదాలు
► బోడికొండ... బడేదేవరకొండపై గిరిజనుల అభ్యంతరాలు
► చీపురుపల్లి పరిసరాల్లో లెక్కలేనన్ని అక్రమాలు
► నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వ్యవహారం
► అన్నిచోట్ల ప్రభుత్వ పెద్దల జోక్యం
► ముందుకెళ్లడంపైనే అనుమానాలు
అనుమతులు ఒకచోట... మైనింగ్ చేస్తున్నది మరో చోట. పార్వతీపురం మండలంలో గల బడేదేవర కొండ మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలివి. ఇప్పుడీ కోణంలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం అందుకు సహకరిస్తున్నారని, జరిగిన తప్పిదాన్ని గుర్తించకుండా కప్పిపుచ్చేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కోరి గ్రామంలో సర్వే నంబర్ 1లో గల 16.56హెక్టార్లను 20 సంవత్సరాలకు చెన్నైకి చెందిన ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు లీజుకివ్వగా, ఇప్పుడా సంస్థ ములగ గ్రామంలో సర్వే నంబర్ 1లో గల రిజర్వు ఫారెస్టు భూముల్లో మైనింగ్ చేస్తున్నదని హైకోర్టులో పిల్ పడింది. దీనిపై ఇప్పటికే హైకోర్టు సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది.
పార్వతీపురం మండలంలోని బుదురువాడ పంచాయతీలో గల బోడికొండపై 10హెక్టార్లలో గ్రానైట్ తవ్వుకునేందుకు పొకర్నా అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 135హెక్టార్ల కోసం 18 దరఖాస్తులొచ్చాయి. కానీ, అందులో పొకర్నా కంపెనీకి మాత్రమే ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రానైట్ కంపెనీలకు అనుమతులివ్వడంపై ఇక్కడి గిరిజన గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
► జిల్లాలోని చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడితో పాటు ఎస్‌కోట, కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇక్కడొక మాఫియా నడుస్తోంది. అనధికార తవ్వకాలతో పాటు అక్రమ రవాణా చేస్తున్నారు. రూ. కోట్లలోనే పక్కదారి పడుతోంది.
► అరకు పార్లమెంట్ పరిధిలోని కొండలపై బాక్సైట్ గనులపై ప్రభుత్వ పెద్దలు కన్నేసి ఉంచారు. గిరిజనులను ఏదోఒక విధంగా మాయ చేసి దోపిడీ చేసేందుకు తహతహలాడుతున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు అడ్డు తగలకుండా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రతిపక్ష పక్షానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి లాక్కున్నారు. మిగతా ఇద్దరు లొంగకపోవడంతో బాౖక్సైట్ వ్యూహం బెడిసికొట్టింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భూగర్భ... గనుల శాఖ మొత్తం వివాదాల మయం. ఇందులో ప్రతీ అంశంలోనూ పెద్దల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ శాఖకు తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈ పోర్టుపోలియో ఆయనకొక సవాల్ కాక తప్పదు. గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా... సర్కారుకు అనుకూలంగా... జిల్లాకు నష్ట కలగకుండా కాస్త ఆచితూచి వ్యవహరించాలి్సందే. దీనిపై ఈయన వ్యూహం ఎలా ఉంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇక్కడ విలువైన గనులు కొట్టేయాలని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కంపెనీల ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వారి విషయంలో తాజా మంత్రి ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్నార్థకం.
రగులుతున్న బోడికొండ, బడేదేవరకొండ వ్యవహారం
జిల్లాలో వివాదస్పదమైన బోడికొండ, బడేదేవరకొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానై ట్’ ఉంది. విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న క్వాలిటీ గల గ్రానైట్‌పై రాష్ట్రంలోని పెద్ద పెద్ద గ్రానైట్ కంపెనీలు దృష్టి సారించాయి. అందులో భాగంగా బోడికొండపై ఉన్న 135హెక్టార్ల కోసం 18దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పొకర్నా అనే కంపెనీకి మాత్ర మే 10హెక్టార్ల భూముల్లో గ్రానైట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బోడికొండ నుంచి వచ్చిన నీటితో ఆ పంచాయతీలోని గోచెక్క, బుదురువాడ, బొడ్డవలస, సంగందొరవలస, టేకులోవ, బిత్తరటొంకి తదితర గ్రామాల్లోని 1000 ఎకరాల వ్యవసాయ భూములు సాగవుతున్నాయనీ, ఈ కొండపై ఉన్న వెదురుతో 1000 గిరిజన కుటుం బాలు, ఉపాధి పొందుతున్నాయని, గ్రానైట్ తవ్వకాల వల్ల అటు సాగునీటి వనరులు అందకుండా పోతాయనీ, వెదురు సంపద ధ్వంసమవుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా అనుమతులిస్తారని పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు. మైనింగ్ కోసం లైన్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.
ఉద్రిక్తతకు దారితీస్తున్న బడేదేవరకొండ
గిరిజనుల ఆరాధ్యదైవమైన బడి దేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజు రూపంలో అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులొక చోట ఇస్తే తవ్వకాలు మరో చోట చేస్తున్నారని, అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. బడిదేవర కొండ గ్రానైట్ కోసం 2009లో ఎంఎస్పీ గ్రానైట్ సం స్థ దరఖాస్తు చేసుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చేందు కు ఆసక్తి చూపలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ సంస్థ తెరపైకి వచ్చింది. 2014జూన్ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 16.56హెక్టార్లు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది.
గతేడాది జూన్ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. ఇక్కడి గిరిజనులు బడేదేవర కొండ దేవతను పూజిస్తేనే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. దీనిని మైనింగ్ కోసం లీజుకివ్వడంతో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీని అనుమతుల వెనుక సీఎంకు సన్నిహితంగా ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం ఉందనే ప్రచారమూ ఉంది.
దీనికి అడ్డొస్తున్నారన్న కారణంగానే రాజధాని స్థాయిలో స్కెచ్ వేసి ఓ అధికారిని బలిపశువును చేశారు. 2006లో బడిదేవరకొండ గ్రానైట్ తవ్వుకోవడానికి అనుమతి కోరిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తిని కూడా రంగంలోకి దించారు. ఎంఎస్పీ గ్రానైట్ సంస్థకు ఇచ్చిన మాదిరిగానే తమకూ అనుమతులు ఇవ్వాలని లోపాయికారీగా ప్రయత్నిస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా బాక్సైట్ వివాదం
బాక్సైట్ వ్యవహారం కూడా సీరియస్‌గా ఉంది. గిరిజనులతో ముడిపడి ఉన్నవే. వీటిన్నింటిని సానుకూలంగా పరిష్కరిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లోనై గిరిజనుల ప్రయోజనాలకు దెబ్బతీస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలతో అంతగా సత్సంబంధాలు లేని మైనింగ్ శాఖ వచ్చినప్పటికీ దానిచుట్టూ వివాదాలు ఉండటం సుజయకృష్ణ రంగారావుకు కాసింత సవాల్‌గానే చెప్పుకోవాలి.