వినూత్నంగా నూతన ఏడాదికి స్వాగతం
అటవీ ప్రాంత వాసులతో కలిసి మంత్రి ఆంజనేయ సెలబ్రేషన్స్
బెంగళూరు : అభివృద్ధికి చాలా దూరంలో అడవుల్లో నివసిస్తున్న ప్రజలతో కలిసి నూతన ఏడాదికి స్వాగతం పలకనున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. చామరాజనగర జిల్లాలోని కొల్లేగాల తాలూకాకు చెందిన గొంబెగళ్లు కెరెదింబ గ్రామస్తులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నానని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 80 గుడిసెలు ఉన్నాయన్నారు. అయితే వారికి ఇప్పటికీ విద్యుత్, రక్షిత మంచినీటి సరఫరా తదితర సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదన్నారు. డిసెంబర్31 ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ (జనవరి 1 వరకూ) అక్కడే ఉంటానన్నారు.
ఈ సమయంలో స్థానికులు తీసుకునే ఆహారాన్నే తాను కూడా తింటానన్నారు. ఇక్కడి ప్రజల పరిస్థితిని బయటకు తెలియజేయాలనేది తన ప్రయత్నం వెనుక ముఖ్య ఉద్దేశమని మంత్రి హెచ్ ఆంజనేయ వివరించారు. కాగా, గాడ్సేకు కూడా భారతరత్న దక్కినా ఆశ్చర్యం లేదని తాను అన్నమాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నాను. మాజీ ప్రధాని వాజ్పేయి, దేశ స్వతంత్ర సంగ్రామంలో తన దైన ముద్రవేసిన మదన్మోహన్ మాలవీయలకు భారతరత్న ఇవ్వడంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తనను కోతిగా అభివర్ణించడం అతని విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. కోతి నుంచే మానవుడు వచ్చాడన్న విషయం అతను తెలుసుకోవాలని మంత్రి ఆంజనేయ పేర్కొన్నారు.