ట్రాన్స్‌వార్ !
అధికారుల బదిలీలు జిల్లా టీడీపీలో పెట్టిన చిచ్చు తార స్థాయికి చేరింది. మాటల యుద్ధం కాస్తా, అధినేతకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. మంత్రి తమను ఖాతరు చేయడం లేదంటూ అసంతృప్తి వాదులు మండిపడుతున్నారు. విజయవాడలో జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేసి, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాలో జరిగిన వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీలు టీడీపీలో కాక పుట్టించాయి. మంత్రి మృణాళిని తనకు ఇష్టమైన వారిని తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. బదిలీల్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు సంధిస్తున్నారు. ఎవరేమనుకున్నా మంత్రి మృణాళిని పట్టించుకోవడం లేదు. బదిలీల పై వస్తున్న విమర్శలపై కనీసం స్పందించలేదు. దీంతో అసమ్మతి నేతలు భగ్గుమంటున్నారు. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉద్వేగంతో ఊగిపోతున్నారు. కీలక అధికారుల బదిలీలు జరిగి వారం రోజులు కావస్తున్నా నేతల మధ్య లొల్లి చల్లారడం లేదు. గురువారం విజయవాడలో జరిగే రాష్ట్ర పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సిద్ధమయ్యారు. ఈమేరకు జిల్లా నేతలంతా పయనమవుతున్నారు.
విభేదాలకు కారణాలివి...
అనంతపురంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డి.రమణమూర్తిని జిల్లా పరిషత్ సీఈఓగా నియమించాలని, ఆయన కాని పక్షంలో ఇక్కడ పనిచేసిన మోహనరావునే కొనసాగించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి లేఖ ఇచ్చారు. కానీ ఆ లేఖల్ని పరిగణలోకి తీసుకోకుండా పాడేరు ఆర్డీఓగా పనిచేసిన గనియా రాజకుమారిని నియమించారు. దీంతో టీడీపీ నేతలంతా ఆశ్చర్యపోయారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు బావ అయిన వెంకటేశ్వరరావును డ్వామా పీడీగా నియమించాలని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలిచ్చారు. ఆయన్ని కాదని తొలుత కళ్యా ణ చక్రవర్తిని నియమించారు. ఆయనకిచ్చిన ఉత్తుర్వుల్ని రద్దు చేసి తాడ జాగా ప్రశాంతిని నియమించారు. డీఆర్డీఎ పీడీగా విశాఖపట్నంలో పనిచేస్తున్న వెంకటరావును ఇక్కడ నియమించాలని మరికొందరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. వాటిని కూడా పక్కన పెట్టేసి ఢిల్లీరావును నియమించారు.
ఇక బదిలీ కావల్సిన ఆర్డీఓ వెంకటరావును, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావును ఉద్దేశపూర్వకంగా ఇక్కడే ఉంచారని, బదిలీ చేయాలన్న తమ ప్రతిపాదనలను లెక్కలోకి తీసుకోలేదని మరికొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
తహశీల్దార్ల బదిలీలు కూడా మంత్రి ఇష్టపూర్వకంగా జరిగాయని కొందరు ప్రజాప్రతినిధులు ఆవేదనతో ఉన్నారు.
కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తమ సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మంత్రి చెప్పినట్టే నడుచుకుంటున్నారని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకాలు, పోస్టుల కేటాయింపుల విషయంలో తమకు విలువ ఇవ్వలేదని మరికొందరు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ విధంగా తమకెదురువుతున్న అవమానాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన బదిలీలన్నింటిపైనా అటు అశోక్ గజపతిరాజుకు, ఇటు సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేయాలన్న ఆత్రుతతో అసంతృప్తి వాదులంతా ఉన్నారు. కాంగ్రెస్‌కు అనుకూల వ్యక్తులను తీసుకొచ్చి, తన మార్కు చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయా న్ని అధినేతల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి మం త్రి మృణాళిని లక్ష్యంగా చేసుకుని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమెను కూడా అంతగా పట్టించుకోవడం లేదు. ఇందుకు విశాఖపట్నంలోని కైలాసగిరిలో గిరిజన యూనివర్సిటీ కోసం సీఎం చంద్రబాబును కలిసినప్పుడు మృణాళిని అందరిలో చివర నిలబడ్డారు.
ఆ ఫోటో చూస్తే మంత్రిపై టీడీపీ నేతలకున్న గౌరవమేంటో స్పష్టమవుతోంది. ఏదైతేనేమి తమ ఆవేదన, అక్కసు వెళ్లగక్కేందుకు విజయవాడలో జరిగే రాష్ట్ర పార్టీ సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు అసమ్మతి నేతలంతా కూడబలుక్కుని బయలుదేరుతున్నారు. పనిలో పనిగా గిరిజన యూనవర్సిటీ తరలిపోవడంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, తమకెదురవుతున్న అవమానాలు, జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూడా అశోక్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి, యూనివర్సిటీ జిల్లాకొచ్చేలా ఒత్తిడి చేసే యోచనలో ఉన్నారు. అయితే, అక్కడికెళ్లాక సాహసం ప్రదర్శిస్తారో లేదో చూడాలని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఎంతసేపు ఇక్కడేనని, అధినేతల వద్ద ఆవేదన వెళ్లగక్కే ధైర్యం లేదని చెప్పుకొస్తున్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
పార్వతీపురం : తోటపల్లి నిర్వాసిత గ్రామాల్లోని ఆర్అండ్ఆర్ సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి ఆదే శించా రు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో పలు శాఖల అధికారుల తో సమావేశమయ్యారు. నిర్వాసిత గ్రామాల్లో ముందుగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణాలు, విద్యుత్, తాగునీరు, మౌలిక వసతులపై దృష్టి సారించాలని చెప్పారు.