ఘల్లు ఘల్లు... ఓరుగల్లు
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్
ప్రారంభమైన లోక్ జన్ ప్రథ ఉత్సవాలు
అలరించిన వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లును దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోందని రాష్ట్ర పర్యాటకశాఖ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న లోక్ జన ప్రథ ఉత్సవాలు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ గతంలో సమైక్య రాష్ట్రంలో పర్యాటకానికి తగిన వనరులు లేవని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా చోట్ల వనరులు కల్పిస్తున్నామని అన్నారు.
ఈ మేరకు లోక్ జన ప్రథ ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఓరుగల్లులో ఇప్పటి వరకు సంగీతనాటక అకాడమీ ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదని.. తెలంగాణ ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారులందరూ తెలంగాణ రావాలని కోరుకున్నారని.. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కళాకారులకు గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారని అన్నా రు.
వరంగల్‌లో మొదటిసారి కైట్ ఫెస్టివల్ జరిగిందని పద్మాక్షి గుట్ట వద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్మించనున్నామని వివరించారు. ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకళాకారుల ప్రదర్శనను చూసేందుకు మంచి అవకాశం లభించిందని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లని అన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి అధికారి సంజయ్‌కుమార్, డీఆర్వో శోభ, సమాచారశాఖ డీడీ డీఎస్.జగన్ పాల్గొనగా.. డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్, డాక్టర్ చుక్కా సత్తయ్యను ఘనంగా సన్మానించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
లోక్ జన ప్రథ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జానపద గిరిజన కళాకారులు అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించారు. అదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం దూపర్పేట గ్రామానికి చెందిన తోటి గిరిజన కళాకారులు సీహెచ్. కృష్ణారావు æబృందం తమ కిక్రి, కుజ్జా, డాకి వాయిద్యాలతో గొండులు తమ ఇష్టదేవతలు భావించే పాండవుల కథను పాడి వినిపించారు, మహారాష్ట్ర లోని సాంగ్లి ప్రాంతానికి చెందిన వీరప్ప దేవుని కొలిచే శ్రీగిరిదేవ్మ గజనృత్య నవయువక మండల్ వారు అనిల్ కొలేకర్ అధ్వర్యంలో గొడుగులతో జండాలతో ధన్గరిగాజ ప్రదర్శన ఇచ్చారు.
ఒరి స్సాలోని గంజాం ప్రాంతానికి చెందిన సబర్ గిరిజనులు 200 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన తమ అమ్మవారిని స్వాగతిస్తూ చడ్డేయ ప్రదర్శనతో ఉర్రూతలూగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పాడేరు నుండి వచ్చిన భగత గిరిజన కళాకారులు మోహన్ రావు బృందం థింస్సా స్త్రీల నృత్యంతో ఆకట్టుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన గడ్డం శ్రీనివాస్ బృందం చిందుయక్షగాన ప్రదర్శన, భూపాలపల్లి జిల్లా కర్కపలికి చెందిన తాట సమ్మక్క బృందం కోలాటం నృత్యం అలరించాయి.