అనవసర శస్త్రచికిత్సలు వద్దు...
ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
‘సాక్షి మీడియా-లివ్ వెల్ ఎక్స్పో’ ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: కొంతమంది వైద్యులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని... అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.ల క్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ మీడియా, డీఎస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైటెక్స్‌లో ఏర్పా టు చేసిన ‘లివ్ వెల్ ఎక్స్పో’ను ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డెరైక్టర్ రాణిరెడ్డి, డి.ఎస్.రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ శేఖర్ త్రివేదిలతో కలసి ఆయన ప్రారంభించారు.
దంత, నేత్ర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ఇప్పటికీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగు పర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యాధులు, మందులు, ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్రచికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత నిపుణులు, పత్రికలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఆరోగ్య చిట్కాలు, వైద్యులు చెప్పే జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చన్నారు. కొన్ని పత్రికలు అనవసర రాతలు రాస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సందర్భంలో ‘సాక్షి ’మీడియా ప్రజారోగ్యాన్ని ఏకైక ఎజెండాగా తీసుకుని, ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యత
ప్రభుత్వమే ప్రజారోగ్యానికి స్ఫూర్తిగా ఉండాలని సమాజం కోరుతోందని కె.రామచంద్రమూర్తి అన్నారు. ప్రజలకు మంచి విద్య, మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ ఆరోగ్య రాజధాని అని అంతా గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ మధుమేహానికి రాజధాని కావడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఒత్తిడి, కాలుష్యం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.
ఎక్స్‌పోలో ఉచిత వైద్య పరీక్షలు
ఈ ‘లివ్ వెల్ ఎక్స్పో’లో ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్రీదేవిజాస్తి ‘ఆహార పదార్థాలు, పోషకాలు’ అంశంపై, డీఎస్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ పూమేశ్వర్ సావంత్‘ కేన్సర్’పై అవగాహన కల్పిం చారు. అదేవిధంగా ‘ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం ఎలా’ అనే అంశంపై డాక్టర్ నీలిమా భట్ వివరించారు. జుంబా ట్రైనర్ ‘జుంబా’ ప్రయోజనాలను వివరించారు. ఎక్స్‌పోలో యాభైకి పైగా కంపెనీలు పాల్గొని, తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. హియరింగ్ సొల్యూషన్స్ నిపుణులు వినికిడి పరీక్షలను, మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు కంటి పరీక్షలు చేశారు. పాజిటివ్ డెంటల్, పార్థడెంటల్ నిపుణులు దంత పరీక్షలు చేయగా, హైదరాబాద్ డయాబెటిక్ సెంటర్స్ నిపుణులు ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించారు. కేన్సర్ జబ్బు, అది రావడానికి గల కారణాలు తదితర అంశాలపై డీస్ రీసెర్చ్ సెంటర్స్ నిపుణులు అవగాహన కల్పించారు. ఎక్స్‌పోలో వివిధ క్లినిక్‌లు, ఆస్పత్రులకు సంబంధించిన 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని వీక్షించేందుకు వచ్చిన సందర్శకులతో ఎక్స్పో కిటకిటలాడింది.