పనిచేయని సుజనా సూత్రం.. తెరపైకి బీసీల ఐక్యమంత్రం!
మంత్రి ఉమాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న బీసీ ఎమ్మెల్యేలు
అండగా మరో మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు
తమ సమస్యలపై సీఎం వద్దే తేల్చుకోవాలని నిర్ణయం
విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య అదిపత్యపోరు రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ జిల్లా పరిశీలకుడు సుజనా చౌదరి చేసిన ఉపదేశం ఏమాత్రం పనిచేయలేదు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా జిల్లాలోని సొంత పార్టీకే చెందిన ఒక మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఉమా తీరుపై బీసీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. ‘పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రి ఉమా వైఖరిపై ఆక్రోశంతో ఉన్నారు. కానీ, ఎవరూ బయటపడటంలేదు. నేను మాత్రమే బయపడుతున్నా..’ అని కేశినేని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుజనాచౌదరి నగరానికి వచ్చి సమావేశం ఏర్పాటుచేసి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. అయితే, కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తాము సుజనా చౌదరి చెబితే సర్దుకుపోలేమని, నేరుగా సీఎం వద్దే తేల్చుకుంటామని వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.
మంత్రి ఉమాకు చెక్ పెట్టేందుకు..!
నామినేటెడ్ పోస్టుల విషయంలో మంత్రి ఉమా ఆదిపత్యానికి చెక్ పెట్టి తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు కలిసి రెండు రోజుల క్రితం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ మంత్రి దేవినేని తీరుపైనే చర్చ సాగినట్లు తెలిసింది. జిల్లాలో ఒక ఎంపీతోపాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు. వీరికి కాపు సమాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే బీసీ నేతలకు అండగా నిలిచి ఆ వర్గానికి నేతగా తాను చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది.
సీఎం వద్దకు పంచాయితీ!
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. సీఎం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఆ సమయంలో సీనియర్ నేతలు తమ ఆవేదనను సీఎంకు వివరించే అవకాశం ఉందని సమాచారం. సీఎం కూడా పార్టీకి సంబంధించి నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.