వైద్య శాఖ ఓఎస్డీ సంపత్ తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య పేషీలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్‌ను తొలగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించుకోవాలని ఆదేశించింది. ఆయనను తొలగించనున్నట్లు ‘సాక్షి’ శుక్రవారం సంచికలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఎన్హెచ్ఎంలో ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందన్న సాక్ష్యాలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనేక విభాగాల్లో జోక్యం చేసుకొని సమీక్షలు చేయడం, ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు అందిన ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆయనపై వేటు వేసింది. మరో ఓఎస్డీపైనా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం దీన్ని ధ్రువీకరించడంలేదు.