మంత్రి అనుచరుల దౌర్జన్యం
మచిలీపట్నం : ఓ ఇంటి స్థలం వివాదంలో మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. లంకిశెట్టి తాండవ కృష్ణకు జగన్నాథపురంలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం సమీపంలో ఇల్లు ఉంది. ఈ ఇంటిని తాండవకృష్ణ తండ్రి తన కుమార్తెలకు ఇస్తానని ప్రకటించడంతో గతంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి తాండవకృష్ణ ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. గత నెలలో ఈ గృహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తన భార్య నీలిమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి అనుచరులు కొందరు తాండవ కృష్ణ ఇంటి వద్దకు వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని వాదనకు దిగారు.
తనకు తెలియకుండానే ఇంటి రిజిస్ట్రేషన్ జరిగిందని, తనకు కొంత సమయం కావాలని తాండవకృష్ణ కోరారు. ఫిర్యాదు చేసిన ఆయనను పోలీ సులు బెదిరించే ధోరణితో మాట్లాడారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని , మరికొందరు కౌన్సిలర్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారి ఎదుటే తాండవకృష్ణను ఆర్‌పేట ఎస్.ఐ. బాషా బెదిరించే ధోరణితో మాట్లాడారు. దీంతో ఎస్.ఐ., నాని మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని ఎస్.ఐ. బాషా తెలిపారు.