సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో గీతారెడ్డి భేటీ
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో మంత్రి గీతారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సచివాలయంలోని తన చాంబర్లో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులతో దాదాపు నలభై నిమిషాలు చర్చించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందుతున్న అంశాలను లిఖిత పూర్వకంగా అందజేస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజనానంతరం తమ ఉద్యోగాలు, పదోన్నతులు, పెన్షన్లు, పిల్లల భవిష్యత్తు వంటి సమస్యలను ఉద్యోగులు మంత్రి ఎదుట వెలిబుచ్చారు. తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని ఉద్యోగులు చెప్పగా తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా ఏపీఎన్జీవోస్ను కూడా మంత్రి సమావేశానికి ఆహ్వానించగా వారు రాలేదు.