ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో సీఎం పాత్ర శూన్యం
కరీంనగర్, న్యూస్‌లైన్ : రామగుండలం ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణ విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి ని పొగడడం సరికాదన్నారు.
తనతోపాటు తన తండ్రి, మాజీ మంత్రి జి.వెంకటస్వామి అనేకసార్లు చేసిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం ఎఫ్‌సీఐని పునరుద్ధరిస్తోందని తెలిపారు. నేదునూరు గ్యాస్ ఆధారిత ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపుల పై సీఎం కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదని, సీమాంధ్రలోని జెన్కో, జీఎంఆర్ ప్లాంట్లకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేయించుకున్నారని విమర్శించా రు. నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సూచనలు ఉన్నాయని, కుట్రలు, కుతంత్రాల కు తెరదించి అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని అన్నారు. కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని, తాను టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు.
సీఎం, డీజీపీని బర్తరఫ్ చేయాలి
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సీమాంధ్ర పక్షపాతులుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న సీఎంకు పాలించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే గంగుల, కట్ల సతీశ్, రఘువీర్‌సింగ్, అక్బర్‌హుస్సేన్, లక్కాకుల మోహన్‌రావు, నందెల్లి మహిపాల్, మొగిలోజు వెంకట్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.