మేడ్ ఇన్ చైనా.. తక్కువ ధర సీక్రెట్ ఇదేనట!
- పార్లమెంట్లో ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆసక్తికర సమాధానం
న్యూఢిల్లీ: గడిచిన 15 ఏళ్లుగా ‘మేడ్ ఇన్ చైనా’ సరుకులు ప్రపంచాన్ని ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆయా దేశాల పరిశ్రమలు కుదేలయ్యేలా అతి తక్కువ ధరలకే వస్తువులను అమ్ముకుంటోంది చైనా. భారత్‌లో సైతం పట్టణాలు, పల్లెలనే తేడాల్లేకుండా చైనా సరుకులు విస్తరించాయి. చైనా దూకుడు పట్ల సగటు భారతీయుడి సందేహం.. ‘ఈ వస్తువులను మనదగ్గరే తయారుచేసుకోలేమా?’ అని!
సరిగ్గా ఇదే ప్రశ్నను పార్లమెంట్లో లేవనెత్తారు ఓ ఎంపీ. ‘ఇండియాలో తయారైన వస్తువుల కంటే మేడిన్ చైనా సరుకులు చీప్‌గా ఎలా దొరుకుతున్నాయి? వాటి వల్ల మన పరిశ్రమలు దెబ్బతింటున్నాయి కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ పటేల్.. ఆసక్తికర సమాధానాలను లిఖిత పూర్వకంగా ఇచ్చారు.
‘చైనా ప్రభుత్వం అక్కడి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఎత్తున సబ్సిడీలు అందిస్తోంది. తద్వారా సరుకుల ఉత్పత్తి సునాయాసంగా, వేగవంతంగా జరుగుతోంది. అందువల్లే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచమార్కెట్లోకి తక్కువ ధరకే అమ్ముకోగలుగుతున్నాయి’ అని చైనీస్ గూడ్స్ లోకాస్ట్ సీక్రెట్‌ను వెల్లడించారు మంత్రి హరిభాయ్.
చిన్న, మధ్యతరహా ఉత్పత్తి సంస్థల మనుగడ.. ప్రధానంగా వాటి సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి.. సమయానుకూలంగా ప్రభుత్వం అందించే రుణాలు, టెక్నాలజీ స్థాయిని పెంచుకోవడం, మార్కెటింగ్ సదుపాయాలు, నాణ్యత తదితర అంశాలు కూడా ఉత్పత్తి సంస్థలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. దేశవాళీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ, బహుళజాతి సంస్థలు బహుగా విస్తరించడం లాంటివి చిన్న,మధ్యతరహా పరిశ్రలకు ప్రతికూలాంశాలుగా మారాయని మంత్రి హరిభాయ్ అభిప్రాయపడ్డారు.