Minister indrakaranreddy
-
రూ.80 కోట్లతో కాల్వల మరమ్మతు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వట్టివాగు నీటి విడుదల ఆసిఫాబాద్ : రూ.80 కోట్లతో వట్టివాగు కాల్వల మరమ్మతు చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాల్వ నీటని మంత్రి ఆయకట్టుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఐదు సార్లు పర్యటించారని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వాసితుల భూ సేకరణకు రూ.వంద కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. భవిష్యత్తులో వట్టివాగు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎంపీ గోడం నగేశ్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఇరిగేషన్ ఎస్ఈ భగవంత్‌రావు, ఈఈలు బద్రినారాయణ, గుణవంత్‌రావు, ఎంపీపీ తారాబాయి, వాంకిడి జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు ఎండీ మహమూద్ పాల్గొన్నారు. -
‘డబుల్’కు విదేశీ నిధులు
♦ ఆసక్తి కనబరిచిన అంతర్జాతీయ సంస్థలు ♦ ఖర్చు తగ్గించే అంశంపై వర్క్‌షాపు సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. వీలైతే ఇక్కడి బ్యాంకుల వడ్డీ కంటే తక్కువకే నిధులు సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. పెట్టుబడితోపాటు వాటి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. తక్కువ ఖర్చుతో వాటిని నిర్మించేందుకు ఉన్న ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఇతర ఖర్చు నియంత్రణ మార్గాలపై సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం దేశవిదేశీ సంస్థలతో బుధవారం ఇక్కడ వర్క్‌షాపు నిర్వహించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అమెరికాకు చెందిన నెక్ట్స్ వాల్ కంపెనీ, జర్మనీకి చెందిన జీఐపీ ఎల్సీసీఈ సొల్యూషన్స్, బెల్జియంకు చెందిన సిస్మో సంస్థలు తాము ఆ పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించాయి. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 8 నుంచి 12 సంవత్సరాల గడువు ఇవ్వనున్నట్టు తెలిపాయి. అయితే ఎంత వడ్డీ విధిస్తామనే విషయాన్ని చర్చల సందర్భంగా ప్రకటిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. కర్ణాటక కంపెనీ ఆసక్తి... కర్ణాటకలో పేదల ఇళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న గరుడ నిర్మాణ సంస్థ కూడా ‘డబుల్’ పథకంపై ఆసక్తి చూపింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిట్ కాస్ట్‌ను కొంత పెంచాల్సి ఉంటుందని సూచించింది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ మినహాయిస్తే ఖర్చు భారీగా తగ్గుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇంటి పూర్తి డిజైన్‌ను సిద్ధం చేయకపోవటం వల్ల కాంట్రాక్టర్లకు స్పష్టత ఉండటం లేదని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. కనిష్టంగా 50 ఇళ్లు ఒక చోట ఉంటేనే ఖర్చు అదుపులో ఉంటుందన్నారు. హెచ్ఎండీఏ తరహాలో కొంత స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కల్పిస్తే తాము సిద్ధమని కొందరు బిల్డర్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ పెంచాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సీఎంకు నివేదిస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి ఈ వర్క్‌షాపులో వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీలైనంత తక్కువ ఖర్చులో అనుకున్న తరహాలో ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. -
జనమెత్తిన గోదావరి
గౌతమి చెంత.. భక్తుల పులకింత.. ♦ పిండప్రదానాలు.. పుణ్యస్నానాలు ♦ భద్రాద్రిలో పుష్కర స్నానం చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ♦ నేడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి తీరం భక్తజనసందోహంతో పులకించిపోయింది. జనప్రవాహం సాగుతోందా అన్నట్లుగా ఎటూ చూసినా జనమే జనం. ఒకవైపు భక్తుల పుణ్యస్నానాలు... మరోవైపు పితృదేవతలకు పిండప్రదానాలతో నదీ తీరం కిక్కిరిసిపోయింది. వచ్చి పోయే భక్తులతో కరకట్ట, ఘాట్ రోడ్డు మొత్తం నిండిపోయింది. ముందురోజు రాత్రి వచ్చిన భక్తులంతా తెల్లవారు జామునే గౌతమి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు పితృదేవతలకు తర్పణాలు వదిలారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైన జనవాహిని క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. వేల నుంచి లక్షల సంఖ్యకు భక్తజనం పెరిగింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు గోదావరి ఒడిలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. యువత గోదావరి తల్లి ఒడిలో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు. జిల్లాలోని మొత్తం 8 ఘాట్లు పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన వీల్ చైర్ల ద్వారా వారిని పుష్కర ఘాట్లకు తరలిస్తూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు సేవలు అందించారు. భక్తులకు అవసరమైన సమాచారం, మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ఆధ్యాత్మిక వేత్తలచే ప్రవచనాలు అందిస్తూ భక్తులను భక్తిపారవశ్యంలోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు స్టేడియం వెనుకవైపు ఏర్పాటు చేసిన కళా వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపుతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులతో సహా భద్రాచలంలోని పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మోతెఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. నేడు,రేపు భక్తుల రద్దీ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు కాగా, భక్తులు జిల్లాలోని పుష్కర ఘాట్లకు పోటెత్తే అవకాశం ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రధాన రహదారిపై బస్టాండ్ నుంచి ఆలయానికి, ఘాట్‌కు వెళ్లే రోడ్లవెంబడి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. అధికారులు ఎప్పటికప్పుడు భద్రత చర్యలను పర్యవేక్షించడంతోపాటు శని, ఆదివారాలు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించుకుంటున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ రెండురోజులు కీలకం కావడంతో ఎలాగైనా పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులు భావించి అన్నివిధాలా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల కోసం అదనపు బస్సులు రెండు భద్రాద్రికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 360 బస్సులు నడుస్తుండగా వాటి సంఖ్యను 450 వరకు అవసరాన్ని బట్టి పెంచనున్నారు. అదేవిధంగా సారపాక నుంచి భద్రాచలం వరకు ప్రస్తుతం తిప్పుతున్న 110 షటిల్ బస్సులను 125కు పెంచుతున్నట్లు భద్రాచలం ఆర్టీసీ డీఎం నామా నర్సింహా ‘సాక్షి’కి తెలిపారు. పర్యవేక్షణకు ఇద్దరు మంత్రులు జిల్లాలో పుష్కరాలను పర్యవేక్షించేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారు. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితోపాటు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే తుమ్మల భద్రాచలంలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తుండగా శుక్రవారం రాత్రికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేరుకోనున్నారు. అదేవిధంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం స్పెషల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో మానిక్‌రాజ్, యోగితారాణాలు ఉన్నారు. భక్తులందరికీ ఆలయ దర్శనం : మంత్రి సామాన్య భక్తులకు కూడా ఆలయ దర్శనం ఉంటుం దని, దీనిలో ఎటువంటి అపోహలు వద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కళ్యాణ మండపంలో స్వామి మూర్తులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంత సమయమైనా వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటామనేవారికి ఆలయ దర్శనం ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు సహకరించాలని కోరారు.