![‘డబుల్’కు విదేశీ నిధులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71460586868_625x300.jpg.webp?itok=Mbal0BXk)
‘డబుల్’కు విదేశీ నిధులు
♦ ఆసక్తి కనబరిచిన అంతర్జాతీయ సంస్థలు
♦ ఖర్చు తగ్గించే అంశంపై వర్క్‌షాపు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. వీలైతే ఇక్కడి బ్యాంకుల వడ్డీ కంటే తక్కువకే నిధులు సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. పెట్టుబడితోపాటు వాటి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. తక్కువ ఖర్చుతో వాటిని నిర్మించేందుకు ఉన్న ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఇతర ఖర్చు నియంత్రణ మార్గాలపై సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం దేశవిదేశీ సంస్థలతో బుధవారం ఇక్కడ వర్క్‌షాపు నిర్వహించింది.
ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అమెరికాకు చెందిన నెక్ట్స్ వాల్ కంపెనీ, జర్మనీకి చెందిన జీఐపీ ఎల్‌సీసీఈ సొల్యూషన్స్, బెల్జియంకు చెందిన సిస్మో సంస్థలు తాము ఆ పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించాయి. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 8 నుంచి 12 సంవత్సరాల గడువు ఇవ్వనున్నట్టు తెలిపాయి. అయితే ఎంత వడ్డీ విధిస్తామనే విషయాన్ని చర్చల సందర్భంగా ప్రకటిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.
కర్ణాటక కంపెనీ ఆసక్తి...
కర్ణాటకలో పేదల ఇళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న గరుడ నిర్మాణ సంస్థ కూడా ‘డబుల్’ పథకంపై ఆసక్తి చూపింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిట్ కాస్ట్‌ను కొంత పెంచాల్సి ఉంటుందని సూచించింది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ మినహాయిస్తే ఖర్చు భారీగా తగ్గుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇంటి పూర్తి డిజైన్‌ను సిద్ధం చేయకపోవటం వల్ల కాంట్రాక్టర్లకు స్పష్టత ఉండటం లేదని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. కనిష్టంగా 50 ఇళ్లు ఒక చోట ఉంటేనే ఖర్చు అదుపులో ఉంటుందన్నారు. హెచ్‌ఎండీఏ తరహాలో కొంత స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కల్పిస్తే తాము సిద్ధమని కొందరు బిల్డర్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ పెంచాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
సీఎంకు నివేదిస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి
ఈ వర్క్‌షాపులో వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీలైనంత తక్కువ ఖర్చులో అనుకున్న తరహాలో ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు.