జనమెత్తిన గోదావరి | Janamettina Godavari | Sakshi
Sakshi News home page

జనమెత్తిన గోదావరి

Published Sat, Jul 18 2015 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

జనమెత్తిన గోదావరి - Sakshi

జనమెత్తిన గోదావరి

 గౌతమి చెంత.. భక్తుల పులకింత..
♦ పిండప్రదానాలు.. పుణ్యస్నానాలు
♦ భద్రాద్రిలో పుష్కర స్నానం చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
♦ నేడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
 
 భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి తీరం భక్తజనసందోహంతో పులకించిపోయింది. జనప్రవాహం సాగుతోందా అన్నట్లుగా ఎటూ చూసినా జనమే జనం. ఒకవైపు భక్తుల పుణ్యస్నానాలు... మరోవైపు పితృదేవతలకు పిండప్రదానాలతో నదీ తీరం కిక్కిరిసిపోయింది. వచ్చి పోయే భక్తులతో కరకట్ట, ఘాట్ రోడ్డు మొత్తం నిండిపోయింది. ముందురోజు రాత్రి వచ్చిన భక్తులంతా తెల్లవారు జామునే గౌతమి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు పితృదేవతలకు తర్పణాలు వదిలారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైన జనవాహిని క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. వేల నుంచి లక్షల సంఖ్యకు భక్తజనం పెరిగింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు గోదావరి ఒడిలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. యువత గోదావరి తల్లి ఒడిలో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు.

  జిల్లాలోని మొత్తం 8 ఘాట్‌లు పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన వీల్ చైర్ల ద్వారా వారిని పుష్కర ఘాట్‌లకు తరలిస్తూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు సేవలు అందించారు. భక్తులకు అవసరమైన సమాచారం, మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేశారు.  దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ఆధ్యాత్మిక వేత్తలచే ప్రవచనాలు అందిస్తూ భక్తులను భక్తిపారవశ్యంలోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు స్టేడియం వెనుకవైపు ఏర్పాటు చేసిన కళా వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపుతున్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులతో సహా భద్రాచలంలోని పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మోతెఘాట్‌లో పుష్కరస్నానం చేశారు.

 నేడు,రేపు భక్తుల రద్దీ
 రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు కాగా, భక్తులు జిల్లాలోని పుష్కర ఘాట్‌లకు పోటెత్తే అవకాశం ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రధాన రహదారిపై బస్టాండ్ నుంచి ఆలయానికి, ఘాట్‌కు వెళ్లే రోడ్లవెంబడి బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు.

  అధికారులు ఎప్పటికప్పుడు భద్రత చర్యలను పర్యవేక్షించడంతోపాటు శని, ఆదివారాలు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించుకుంటున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ రెండురోజులు కీలకం కావడంతో ఎలాగైనా పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులు భావించి అన్నివిధాలా చర్యలు చేపడుతున్నారు.

 ప్రయాణికుల కోసం అదనపు బస్సులు
 రెండు భద్రాద్రికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.  ప్రస్తుతం 360 బస్సులు నడుస్తుండగా వాటి సంఖ్యను 450 వరకు అవసరాన్ని బట్టి పెంచనున్నారు. అదేవిధంగా సారపాక నుంచి భద్రాచలం వరకు ప్రస్తుతం తిప్పుతున్న 110 షటిల్ బస్సులను 125కు పెంచుతున్నట్లు భద్రాచలం ఆర్టీసీ డీఎం నామా నర్సింహా ‘సాక్షి’కి తెలిపారు.

 పర్యవేక్షణకు ఇద్దరు మంత్రులు
  జిల్లాలో పుష్కరాలను పర్యవేక్షించేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించారు. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితోపాటు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే తుమ్మల భద్రాచలంలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తుండగా శుక్రవారం రాత్రికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేరుకోనున్నారు. అదేవిధంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం స్పెషల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో మానిక్‌రాజ్, యోగితారాణాలు ఉన్నారు.
 
 భక్తులందరికీ ఆలయ దర్శనం : మంత్రి
  సామాన్య భక్తులకు కూడా ఆలయ దర్శనం ఉంటుం దని, దీనిలో ఎటువంటి అపోహలు వద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కళ్యాణ మండపంలో స్వామి మూర్తులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంత సమయమైనా వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటామనేవారికి ఆలయ దర్శనం ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు  సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement