జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శం
► రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
► పేదల అభివృద్ధే ధ్యేయం : మంత్రి లక్ష్మారెడ్డి
► విద్య లేకపోవడమే వెనకబాటు : కలెక్టర్ టీకే శ్రీదేవి
► జిల్లావ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు
► అసృశ్యత నివారణకు కృషిచేశారు: జూపల్లి
► బడుగుల అభ్యున్నతే ఆయన ధ్యేయం: లక్ష్మారెడ్డి
పాలమూరు : మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూలే 190వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక అసమానత్వం, వి ద్య వివక్షత, పేదరికం వంటి వాటిని నిర్మూలించేందుకు జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని, కుల, మ త రహిత సమాజ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషిచేశారని అన్నారు. జిల్లాలోని అన్ని వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత వల్ల అభివృద్ధి సాధించలేకపోతున్నామని, అం దరూ కలిసి పనిచేస్తేనే వందశాతం అభివృద్ధి సాధ్యమని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ జ్యోతిరావుపూలే సమాజంలోని అన్ని వర్గాల కోసం కృషి చేసిన మహాత్ముడని అన్నారు. పూలే ఆశయా న్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాలని, సమాజంలో ఉన్న 85 శాతం పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యా పరంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని, హాస్టళ్లలో సన్న బియ్యంతో పాటు వెనుకబడిన వర్గాలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు పాలమూరు-రంగారెడ్డితో పాటు వైద్య కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని అన్నారు.
మహిళా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు
కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ జ్యోతిరావుపూలే కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. బాలికలకు విద్య లేకపోవడం, అగ్రవర్ణాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉన్న పరిస్థితులను ఎదిరించి పోరాడి మహిళా విద్యను ప్రోత్సహించడమే కాకుండా తన భార్య సావిత్రీబాయి పూలేను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారుచేసిన ఘనత పూలేదే అన్నారు. వనరులు లేకపోవడం వల్ల జిల్లా వెనుకబడలేదని, విద్య లేకపోవడం వల్లనే వెనుకబడి ఉందని, జిల్లాలోని వెనుకబాటుతనం పోవడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో నూటికి నూరు శాతం బీసీ యాక్షన్ ప్లాన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బీసీల అభ్యున్నతికై జిల్లాలో బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి జ్యోతిరావుపూలే కృషిచేశారని, వారి విధానాలకు అనుగుణంగానే రాజ్యాంగం రచించడం జరిగిందని అన్నారు. అంతకుముందు పద్మావతికాలనీలో పూలే విగ్రహానికి మంత్రులు, జెడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంధ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ శివకుమార్, రాజేశ్వర్‌గౌడ్, బీసీ సంఘ నేతలు ప్రేమ్‌సాగర్, అశోక్, శేఖర్, పురుషోత్తం, మనోహర్, గోనెల శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్, మున్నూరు రాజు, అశోక్‌గౌడ్, భూమయ్య ప్రసంగించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న 28 మందికి రూ.2.80 లక్షల చెక్కులను, కళాశాల విద్యార్థులకు రూ.11 లక్షల విలువ చేసే లైబ్రెరీ పుస్తకాలను పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 52 మంది లబ్ధిదారులకు కోటి 30 లక్షల రూపాయల సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు.