సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : సాగునీరు విడుదల చేయాలంటూ బందరు రైతులు ఆదివారం రోడ్డెక్కారు. మం డలంలోని సుల్తానగరం, ఎస్.ఎన్.గొల్లపాలెం, సీతారామపురం గ్రామాల రైతులు సుల్తానగరంలో మచిలీపట్నం-విజయవాడ రహదారిపై బైఠాయించి గంటసేపు రాస్తారోకో చేశారు. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రైతులకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు తోట శ్రీనివాస్ మద్దతు తెలిపారు.
ప్రభుత్వం, మంత్రి కొలుసు పార్థసారథి, ఇరిగేషన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో విషయం తెలిసిన గూడూరు ఎస్ఐ వై.సత్యరమేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి బందరు కాలువకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చేంత వరకూ తాము ఆందోనను విరమిం చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎస్ఐ, రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జిల్లా మంత్రి కేపీసారథి కంకిపాడు నుంచి దిగువకు సాగునీటిని విడుదల చేయకుండా ఇరిగేషన్ అధికారులను నియంత్రిస్తున్నందునే తమ పొలాలకు నీరు రావడంలేదని ఆరోపించారు. చివరకు ఇరిగేషన్ అధికారులు వస్తున్నట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఎస్ఎన్ గొల్లపాలెం మాజీ సర్పంచులు రామచంద్రరావు, జి.వెంకటేశ్వరరావు, సుల్తానగరం సర్పంచి మట్టా వెంకట దాసు, మాజీ వైస్ ఎంపీపీ కాగిత అమ్మయ్య తదితరులు నాయకత్వం వహించారు.
ఇరిగేషన్ కార్యాలయాలను దిగ్బంధనంచేస్తాం : పేర్ని
బందరు కాలువకు సోమవారం నాటికి సాగునీటిని విడుదల చేయకుంటే ఇరిగేషన్ కార్యాల యాలను దిగ్బంధిస్తామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) హెచ్చరించారు. మంత్రి కేపీ సారథిని బందరు ప్రాంత రైతులు అడ్డుకుంటారని పేర్కొన్నారు. రాస్తారోకో వద్దకు వచ్చిన నాని రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు నీరు ఇస్తామని మంత్రి సారథి హామీ ఇచ్చినందునే రైతులు ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేసి నారుమడులు పోశారన్నారు. వేల క్యూసెక్కుల కృష్ణానది నీటిని సముద్రం పాల్జేస్తున్న పాల కులు, పొలాలకు ఇవ్వకపోడం ఏమిటని ప్రశ్నించారు. కంకిపాడు నుంచి దిగువనున్న ఆకుమర్రు, రామరాజుపాలెం లాకులకు నీటి చుక్క రావడం లేదన్నారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి దిగువకు సాగునీరు విడుదల చేయొద్దని ఇరిగేషన్ అధికారులను మంత్రి సారథి ఆదేశించారని విమర్శించారు.