‘మేం సూర్య నమస్కారాలు చేయడం నేరం’
లక్నో: పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యోగాను అదే పద్ధతిలో ముస్లింలు చేయడం పెద్ద నేరమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లాంను విశ్వసించేవారు అల్లా ముందే ప్రార్థిస్తారని, కానీ ప్రస్తుత పద్ధతిలో సూర్య నమస్కారాలతో యోగా చేయడం వల్ల అల్లాతో పాటు ఇతరులనూ ఆరాధించినట్లు అవుతుందని బుధవారం బోర్డు ప్రతినిధి రహీమ్ ఖురేషీ చెప్పారు.
యోగాను మతానికి ముడిపెట్టరాదని, ఆరోగ్య వ్యాయామంగానే చూడాలన్న మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి నఖ్వీ వ్యాఖ్యలను ఆయన తిరస్కరించారు. యోగాలో ఓమ్ను ఉచ్చరిస్తూ, చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేస్తారని, ఇస్లాంను పాటించేవారు అల్లా ముందు తప్ప ఎవరి ముందైనా మోకరిల్లుతారా? అంటూ ప్రశ్నించారు.