నవంబర్ 1 వరకు వేచిచూస్తా: మంత్రి విశ్వరూప్
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని హైకమాండ్ వెనక్కి తీసుకుంటుందని నమ్మకం తనకుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. తమ ప్రాంతానికి సానుకూల నిర్ణయం కోసం నవంబర్ 1 వరకు వేచిచూస్తానని అన్నారు. విభజన నిర్ణయాన్ని హైకమాండ్ వెనక్కి తీసుకోకుంటే 2న రాజీనామా చేస్తానని విశ్వరూప్ వెల్లడించారు.
రాష్ట్ర విభజనే జరిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర విభజన జరిపితే తానే మొదటిగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. విభజన జరగకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పలుమార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రావులపాలెంలో లక్షగళ గర్జన నిరసన కార్యక్రమంలో ప్రధానపాత్ర పోషించారు.