కమలంలో ‘కుల’కలం
బీజేపీ అధ్యక్ష పదవి కోసం పరాకాష్టకు చేరిన వర్గపోరు
నేతల కుమ్ములాటలతో పార్టీ శ్రేణులకు ఎసరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖలో కుల సమీకరణలు, గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. అధ్యక్ష పదవి కోసం నాయకులు వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలకు తెరలేపారు. తాము సిఫార్సు చేసిన వ్యక్తినే అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని పట్టుబడుతున్నారు. లెక్కకు మించిన నేతల వర్గ రాజకీయాలతో బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో అర్బన్ జిల్లా శాఖలతో కలిపి భారతీయ జనతా పార్టీకి 17 జిల్లా శాఖలు ఉన్నాయి. వీటిలో రాజధాని నేపథ్యంతో కృష్ణా జిల్లా, నేతల వర్గ పోరు కారణంగా పశ్చిమగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లా శాఖల్లోనూ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి ఏపీలో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా సభ్యత్వ నమోదు చేయించిన‘పశ్చిమ’లో అన్నింటి కంటే ముందే అధ్యక్ష పదవి భర్తీ పూర్తి కావాలి. సంస్థాగత ఎన్నికల ప్రకియను కూడా మిగిలిన జిల్లాల కంటే ముందుగానే పూర్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు మార్గం సుగమమైందనుకున్న సమయంలో నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు.
ఎంపీది ఓదారి.. మంత్రిది మరో దారి
నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మొదట్లో తన సోదరుడినే జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించారు. కార్యకర్తల నుంచి అంత సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన వ్యూహాత్మకంగా దళిత నేత బుంగా సారథి పేరును తెరపైకి తీసుకువచ్చారు. గతంలో బీజేపీలో పనిచేసి బయటకు వెళ్లి కాంగ్రెస్, పీఆర్పీల్లో పనిచేసిన సారథి అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీలోని రెండువ ర్గాలు సారధి పేరును ప్రతిపాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే దళిత నేతను కాదన్నారన్న ముద్ర పడకుండా ఎవరికి వారు తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఇదిలావుండగా, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. మిగిలిన జిల్లాల్లో ఎక్కడా తమ సామాజిక వర్గ నేతలకు జిల్లా అధ్యక్ష పదవి రాకపోవడంతో కనీసం పశ్చిమగోదావరి జిల్లాలోనైనా ఆ వర్గానికి అవకాశం ఇవ్వాలని మంత్రి గట్టిగానే వాదిస్తున్నారని చెబుతున్నారు. పాలకొల్లుకు చెందిన రావూరి సుధ పేరును మాణిక్యాలరావు ప్రతిపాదిస్తున్నారు.
పార్టీలో మూడో గ్రూపుగా తయారైన బీజేపీ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మరోసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పీవీఎస్ వర్మ పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి అధ్యక్ష పదవి చేపట్టి ప్రస్తుతం క్వాయర్‌బోర్డు సభ్యుడిగా నామినేటెడ్ పదవిలో ఉన్న ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ మిగిలిన రెండు వర్గాలు వాదిస్తున్నాయి.
ఇంతమంది నేతలు ఏం చేస్తున్నట్టు?
వాస్తవానికి జిల్లాలో బీజేపీ నేతలు లెక్కకు మించి ఉన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావుతోపాటు తీరప్రాంత గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా జిల్లా నేతగానే కార్యకర్తలు భావిస్తుంటారు. కేంద్ర మాజీ మంత్రులు యూవీ కృష్ణంరాజు, కావూరి సాంబశివరావుతోపాటు డెల్టా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు అధినాయకత్వం వద్ద ఎంతోకొంత పట్టు ఉన్న వాళ్లే. ఇంతమంది నేతలు, రికార్డు స్థాయిలో కార్యకర్తలు ఉండి కూడా జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయలేని విచిత్రమైన పరిస్థితిని కమలనాథులు ఎదుర్కొంటున్నారు. కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలోగానైనా జిల్లా అధ్యక్ష పీఠం భర్తీ అవుతుందేమో చూడాలి.