ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తీసుకువచ్చి అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ సౌకర్యాన్ని విద్యార్థులతో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రై వేట్ రంగంలో కూడా అత్యధిక వేతనాలు లభిస్తున్నందున యువత వాటివైపు కూడా దష్టి సారించి ప్రై వేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఏసీ పఠన (రిఫరెన్స్) విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఈ విభాగంలో చదివిన అనేకమంది ఆయా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందారన్నారు.
సొంత భవనాలు లేని గ్రంథాలయాలకు దాతల సహకారంతో సొంత భవనాలు నిర్మించడానికి కషి చేస్తున్న గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తిని అమె అభినందించారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, మాగంటి రాంజీ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సీహెచ్ మదారు తదితరులు పాల్గొన్నారు.