'ముందు మంత్రి, ఎమ్మెల్యేతో పన్నుకట్టించండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో మున్సిపల్ అధికారుల పన్నుల వసూలు వివాదస్పదమవుతోంది. జిల్లాలో నగరపాలక సంస్థ అధికారులు పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసేందుకు శనివారం యత్నిస్తున్నారు. దీంతో షాపు యజమానులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'జిల్లాకు చెందిన మంత్రి , ఎమ్మెల్యే ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించలేదు. ముందు వారి నుంచి పన్నులు కట్టించండి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలకు ఓ న్యాయం...మాకు మరో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాగా సామాన్య ప్రజలు పన్ను చెల్లించకపోతే నీటి సరఫరా బంద్ చేస్తామని, ఆస్తి సీజ్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి రూ. 44 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. సామాన్య ప్రజానీకంపై ధూం..ధాం అంటూ చిందులు వేసే నగరపాలక అధికారులు వారి వద్దకు వెళ్లి పన్నులు అడగాలంటేనే జంకుతున్నారు.