ధార్మిక సభలో ఉద్రిక్తత.. మధ్యలో వెళ్లిపోయిన మంత్రి
హిందూ ధార్మిక సభలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అడ్డదిడ్డంగా విగ్రహాలు కూల్చేసిన చంద్రబాబు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆలయాలు, విగ్రహాల కూల్చివేతపై విజయవాడలో సోమవారం సాయంత్రం భారీ నిరసన సభ నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పలు పీఠాల అధిపతులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నిరసన సభకు విజయవాడ నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సభలో ముందుగా మంత్రి కామినేని శ్రీనివాస్ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడిన కాసేపటికే భక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్, కమిషనర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో సభ మధ్యలోనే కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులతో పాటు దేవాదయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా పాల్గొన్నారు.