అశ్లీల సీడీ చూసి.. మంత్రిని పీకేసిన సీఎం
అది.. రాత్రి 8 గంటల సమయం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి ఓ సీడీ పార్సిల్లో వచ్చింది. దాదపు అరగంట తర్వాత.. తన మంత్రివర్గంలోని అతి చిన్నవయసు మంత్రి సందీప్ కుమార్‌ను తొలగిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు!!
సందీప్ కుమార్ (34) ఇద్దరు మహిళలతో చాలా అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా ఆ 9 నిమిషాల వీడియోలో ఉందని, దాంతోపాటు అందులో కొన్ని ఫొటోలు కూడా ఉన్ నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సీడీ అంతకుముందే కొన్ని టీవీ చానళ్లకు కూడా చేరింది. తక్షణ స్పందన కోసం ముఖ్యమంత్రికి కూడా దాన్ని పంపారని అంటున్నారు. ఇందులో మరో విషయం ఏమంటే, ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సందీప్ కుమార్ మాట్లాడుతూ, తాను నిద్ర లేవగానే ప్రతిరోజూ తన భార్య పాదాలు తాకుతానని చెప్పారు. అలాంటి మనిషే ఇప్పడు ఇలా దొరికిపోవడం విశేషం. మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమశాఖ మంత్రిగా ఇన్నాళ్లు వ్యవహరిస్తున్న సందీప్‌కుమార్ స్థానంలో వేరే ఎవరిని నియమించాలన్న విషయమై రాత్రి చాలా సేపటి వరకు సీఎం కార్యాలయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మీడియాతో మాట్లాడారు. అవినీతి, స్కాంలను తమ పార్టీ ఏమాత్రం సహించదని, మంత్రులు ఎవరైనా లంచాలు తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే తొలగిస్తామని, ఏ సభ్యుడైనా, ఏ స్థాయిలో ఉన్నా ఇదే తరహాలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు మంత్రులను తొలగించారు. ఇంతకుముందు లంచం అడిగినట్లు ఆరోపణలు రావడంతో ఆహార శాఖ మంత్రి ఆసిమ్ అహ్మద్ ఖాన్‌ను, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టిన న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
అయితే అసలు ఎన్నికలు జరగడానికి ముందే కొంతమంది అభ్యర్థుల ప్రవర్తన విషయంలో తాము అభ్యంతరాలు చెప్పామని, అయినా అప్పట్ల అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదని ఆప్ మాజీ సభ్యులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ చెబుతున్నారు. ప్రభుత్వం మొత్తం అవినీతి మయం అయిపోయినందున ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, గత ఏడాది కాలంలోనే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలపై పలు కేసులు నమోదయ్యాయని బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా అన్నారు.
Recd "objectionable" CD of minister Sandeep Kr. AAP stands for propriety in public life. That can't be compromised(1/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016
Removing him from Cabinet wid immediate effect(2/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016