ప్రెస్మీట్ పెట్టి.. లైవ్లో మంత్రిని పీకేశారు!
లంచం అడుగుతూ పట్టుబడిన మంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఓ ప్రెస్మీట్ పెట్టారు. తొలిసారిగా ఆ లైవ్ ప్రెస్మీట్లోనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. తన కొడుకు గానీ, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా గానీ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వాళ్లను కూడా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆరోగ్య, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ (38) లంచం అడిగినందుకు ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నామని, ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్ను నియమిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ బిల్డర్తో కుమ్మక్కైనట్లు ఖాన్ మీద ఆరోపణలు వచ్చాయని చెబుతూ.. వాళ్లిద్దరి మధ్య గంట పాటు సాగిన సంభాషణ టేపులను కూడా మీడియాకు వినిపించారు. ప్రజలు తమను నిజాయితీపరులుగా నమ్ముతున్నారని, అందువల్ల అవినీతికి పాల్పడే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు.. ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వచ్చారు. జూన్ నెలలో నకిలీ డిగ్రీల కేసులో జితేందర్ సింగ్ తోమర్ రాజీనామా చేశారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ఆసిమ్ అహ్మద్ ఖాన్ గత ఎన్నికల్లోనే తొలిసారిగా గెలిచారు. ఆయనకు ఆహార, పౌరసరఫరాలు, పర్యావరణ, అటవీ, ఎన్నికల శాఖలను అప్పగించారు.