న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించిన మరుసటి రోజే.. పార్టీకి చెందిన అసిం అహ్మద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. గత ఏడాది అవినీతి ఆరోపణలతో ఢిల్లీ కేబినేట్ నుంచి అహ్మద్ ఖాన్ ను తప్పించారు.
గత ఏడాది అక్టోబర్ లో పౌరసరఫరాలు, పర్యావరణ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న ఖాన్.. తన నియోజకవర్గంలో భవననిర్మాణానికి రూ.6 లక్షల లంచం తీసుకుని అనుమతులిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. గత 9-10 నెలల నుంచి కేజ్రీవాల్, పార్టీలో మరికొంత మంది నుంచి తనకు, తన కుటుంబానికి చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నట్లు మీడియా సమావేశంలో ఖాన్ పేర్కొన్నారు. పర్సనల్ గా, ఫోన్ ల ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ లకు లేఖలు కూడా రాసినట్లు వివరించారు.
మీడియా సమావేశం ద్వారా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. మీడియాకు ప్రత్యేకంగా ఓ లెటర్ ను విడుదల చేశారు. త్వరలో కేజ్రీవాల్ అసలు రంగు బయటపెడతానని అన్నారు. కేజ్రీవాల్ కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియో టేపు తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆప్ ప్రతినిధి దీపక్ బాజ్ పాల్.. పార్టీ ఖాన్ పై ఏవైనా చర్యలు తీసుకోనుందా? అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా కేబినేట్ నుంచి ఖాన్ ను తొలగించి కేసును సీబీఐకు అప్పగించామని, ఇంతకంటే పెద్ద చర్య ఏదీ లేదని చెప్పారు.
ఖాన్ ప్రాణాలకు ఆప్ నుంచి ముప్పుఉందనే ఆరోపణలపై స్పందించిన బాజ్ పాల్ సరైన సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు చేశారని అన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు తమ సమయాన్ని వృథా చేసుకోరని భావిస్తున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు సీబీఐ కేసును తేలుస్తారని భావిస్తున్నామని చెప్పారు.
'కేజ్రీ నన్నుచంపాలని కుట్రపన్నారు':ఆప్ మాజీ మంత్రి
Published Fri, Jul 29 2016 2:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement