Asim Ahmed Khan
-
పాపం కేజ్రీవాల్.. ముప్పేట దాడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తిరుగుబాబు, అసంతృప్త నేతలు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ముప్పేట దాడికి దిగారు. కేజ్రీవాల్ లంచాలు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే మాజీ మంత్రి కపిల్ మిశ్రా.. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయగా తాజాగా ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్ అహ్మద్ ఖాన్ కూడా ఆయన బాటలో చేరారు. కేజ్రీవాల్, ఆయన అనుచరులు తనను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేబుల్ నెట్‌వర్క్‌ను కొనేందుకు రూ. 25 కోట్లు సమీకరించాలనుకున్నారు. రూ. 5 కోట్లు ఇమ్మని నన్ను అడిగారు. మరో నలుగురు ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లు చొప్పున ఇవ్వాలని కోరారు. ఈ డబ్బులు వసూలు చేసేలా మాపై ఒత్తిడి చేసేందుకు కేజ్రీవాల్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డబ్బుల కోసం మాపై బెదిరింపులకు దిగారు. నన్ను పార్టీ నుంచి గెంటేసినా డబ్బు ఇవ్వనని వారికి చెప్పాను. దీంతో నాపై అసత్య ఆరోపణలు చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు కేజ్రీవాల్, సత్యేంద్రజైన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వారిపై చర్య తీసుకోలేద’ని ఆసిమ్ ఖాన్ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆప్ పంజాబ్ కన్వీనర్ గురుప్రీత్ గుగ్గీ కోరారు. కేజ్రీవాల్‌పై తనకు విశ్వాసముందన్నారు. -
సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అసీం అహ్మద్ ఖాన్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను చంపించేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఇటీవల అసీం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పోరాటం తనపైనే కానీ, తన కుటుంబ సభ్యులపై కాదని, తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. కేజ్రీవాల్, ఆయన అనచరులు తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి హజి మున్నె అలీపై తప్పుడు కేసు పెట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు కావాల్సినవారు గత నెల 31న హెచ్చరించారని వెల్లడించారు. ఈ నెల 2న పాత ఢిల్లీ మీనా బజార్‌లోని తన తండ్రి షాప్ వద్దనకు ఇద్దరు మహిళలు వచ్చి కావాలనే ఆయనతో గొడవపెట్టుకున్నారని, అనుచితంగా ప్రవర్తించి తిట్టారని అసీం చెప్పారు. ఇది కుట్ర అయివుంటుందని సందేహం వ్యక్తం చేశారు. -
'కేజ్రీ నన్నుచంపాలని కుట్రపన్నారు':ఆప్ మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించిన మరుసటి రోజే.. పార్టీకి చెందిన అసిం అహ్మద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. గత ఏడాది అవినీతి ఆరోపణలతో ఢిల్లీ కేబినేట్ నుంచి అహ్మద్ ఖాన్ ను తప్పించారు. గత ఏడాది అక్టోబర్ లో పౌరసరఫరాలు, పర్యావరణ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న ఖాన్.. తన నియోజకవర్గంలో భవననిర్మాణానికి రూ.6 లక్షల లంచం తీసుకుని అనుమతులిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. గత 9-10 నెలల నుంచి కేజ్రీవాల్, పార్టీలో మరికొంత మంది నుంచి తనకు, తన కుటుంబానికి చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నట్లు మీడియా సమావేశంలో ఖాన్ పేర్కొన్నారు. పర్సనల్ గా, ఫోన్ ల ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ లకు లేఖలు కూడా రాసినట్లు వివరించారు. మీడియా సమావేశం ద్వారా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. మీడియాకు ప్రత్యేకంగా ఓ లెటర్ ను విడుదల చేశారు. త్వరలో కేజ్రీవాల్ అసలు రంగు బయటపెడతానని అన్నారు. కేజ్రీవాల్ కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియో టేపు తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆప్ ప్రతినిధి దీపక్ బాజ్ పాల్.. పార్టీ ఖాన్ పై ఏవైనా చర్యలు తీసుకోనుందా? అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా కేబినేట్ నుంచి ఖాన్ ను తొలగించి కేసును సీబీఐకు అప్పగించామని, ఇంతకంటే పెద్ద చర్య ఏదీ లేదని చెప్పారు. ఖాన్ ప్రాణాలకు ఆప్ నుంచి ముప్పుఉందనే ఆరోపణలపై స్పందించిన బాజ్ పాల్ సరైన సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు చేశారని అన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు తమ సమయాన్ని వృథా చేసుకోరని భావిస్తున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు సీబీఐ కేసును తేలుస్తారని భావిస్తున్నామని చెప్పారు. -
ప్రెస్‌మీట్ పెట్టి.. లైవ్‌లో మంత్రిని పీకేశారు!
లంచం అడుగుతూ పట్టుబడిన మంత్రిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. తొలిసారిగా ఆ లైవ్ ప్రెస్‌మీట్‌లోనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. తన కొడుకు గానీ, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా గానీ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వాళ్లను కూడా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆరోగ్య, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ (38) లంచం అడిగినందుకు ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నామని, ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్‌ను నియమిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ బిల్డర్‌తో కుమ్మక్కైనట్లు ఖాన్ మీద ఆరోపణలు వచ్చాయని చెబుతూ.. వాళ్లిద్దరి మధ్య గంట పాటు సాగిన సంభాషణ టేపులను కూడా మీడియాకు వినిపించారు. ప్రజలు తమను నిజాయితీపరులుగా నమ్ముతున్నారని, అందువల్ల అవినీతికి పాల్పడే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు.. ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వచ్చారు. జూన్ నెలలో నకిలీ డిగ్రీల కేసులో జితేందర్ సింగ్ తోమర్ రాజీనామా చేశారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ఆసిమ్ అహ్మద్ ఖాన్ గత ఎన్నికల్లోనే తొలిసారిగా గెలిచారు. ఆయనకు ఆహార, పౌరసరఫరాలు, పర్యావరణ, అటవీ, ఎన్నికల శాఖలను అప్పగించారు. -
ఫిర్యాదు వచ్చింది.. మంత్రి పదవి ఊడింది!
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఆసిం అహ్మద్ ఖాన్ పదవి ఊడింది. అహ్మద్ ఖాన్ ను మంత్రి పదవి నుంచి తొలగించినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అహ్మద్ ఖాన్ పై తమకు అందిన ఫిర్యాదును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు. అవినీతిని సహించబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అహ్మద్ ఖాన్ స్థానంలో నూతన ఆహార శాఖ మంత్రిగా ఇమ్రాన్ హుస్సేన్ ను నియమించారు. హస్తినలో రెండోసారి గద్దెనెక్కినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. న్యాయశాఖ మంత్రులుగా పనిచేసిన సోమనాథ్ భారతి, జితేందర్ సింగ్ తోమర్ కేసుల్లో ఇరుక్కున్నారు. గృహహింసలో కేసులో సోమనాథ్, నకిలీ డిగ్రీ కేసులో తోమర్ కోర్టు మెట్లు ఎక్కారు.