ఆత్మహత్యల సెగ
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సెగ అసెంబ్లీకి తగిలింది. బెళగావిలోని సువర్ణసౌధలో వర్షాకాల సమావేశాలు సో మవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై విరుచుకుపడ్డాయి. ఇదే సందర్భంలో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సువర్ణసౌధను ముట్టడించేందుకు యత్నించారు. సువర్ణసౌధ లో పల, బయట రైతు సమస్యల సెగ ప్రభుత్వానికి తగిలింది.
- లోపలా బయటా అట్టుడికిన అసెంబ్లీ
- వాడీవేడిగా ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు
- మొదటి రోజునే పాలకపక్షంపై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు
- మంత్రి శ్యామనూరు రాజీనామాకు బీజేపీ పట్టు
- సువర్ణసౌధ ముట్టడికి రైతు సంఘాల ప్రయత్నం
సాక్షి, బెంగళూరు: బెళగావిలోని సువర్ణసౌధలో సమావేశాల మొదటి రోజైన సోమవారం మొదటగా ఇటీవల మృతిచెందిన ప్రముఖులకు సంతాపాన్ని ప్రకటించిన అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక సమావేశాల మొదటి రోజున రైతుల సమస్యలపై అధికారపక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. మొదటగా రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. రైతుల సమస్యలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వరకు దూసుకెళ్లి ధర్నాకు దిగారు. ఆఖరుకి చర్చకు అనుమతిస్తానంటూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రతిపక్ష సభ్యులకు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.
ఇక ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రైతుల సమస్యలపై చర్చకు మోషన్ నోటీసుకు ఇవ్వాలని ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ కోరడంతో అధికారపక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ప్రతిపక్షనేత జగదీష్ శెట్టర్ స్పందిస్తూ, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయిన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ విమర్శించారు. మండ్య, మైసూరు, హాసన ఇలా అన్ని ప్రాంతాల్లో రై తుల ఆత్మహత్యల పరంప ర కొనసాగుతోందంటూ చె బుతున్న సమయంలో స్పీ కర్ కాగోడు తిమ్మప్ప కలగజేసుకొని ఈ విషయాన్ని ప్రశ్నోత్తరాల సమయం అ నంతరం ప్రస్తావించాలని కోరారు.
అనంతరం ము ఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, అసెంబ్లీ స మావేశాల సమయంలో చర్చకు అవకాశం ఇవ్వాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ కలగజేసుకుంటూ రైతుల సమస్యలపై చర్చించేందుకు పూర్తి సమావేశాలను బెళగావిలోని సువర్ణసౌధలోనే నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.
శ్యామనూరు రాజీనామాకు బీజేపీ పట్టు
విధానపరిషత్‌లోనూ అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. విధాన పరిషత్ కార్యకలాపాలు ప్రారంభం కాగానే విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ, చక్కెర కర్మాగారాల్లోని నిల్వలను ప్రభుత్వం జప్తు చేసుకోవడాన్ని విమర్శించిన రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘చక్కెర నిల్వలను జప్తు చేసుకోవడంపై శామనూరు శివశంకరప్ప తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. అందుకే శామనూరు శివశంకరప్ప తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
సువర్ణ సౌధ ముట్టడికి రైతుల యత్నం
చెరుకు రైతుల బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వానికి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటిలోపు ప్రభుత్వం స్పంధించకపోతే సువర్ణ విధానసౌధ ముట్టడికి రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అయితే రైతు సమస్యలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం దాటినా ఎటువంటి హామీని ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన రైతులు సువర్ణ విధానసౌధ ముట్టడికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు సంఘం నాయకులైన కోడిహళ్లి చంద్రశేఖర్‌తో సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభ్యుడు పుట్టణ్ణయ్య శాసనసభ వెల్‌లోకి చొచ్చుకువచ్చి ధర్నాకు దిగారు. ఈయనకు అధికార పార్టీకే చెందిన రమేశ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. ఆయన నిరసన మధ్యే శాసనసభ కార్యక్రమాలు కొనసాగాయి. సోమవారం పొద్దుపోయే వరకు సువర్ణసౌధ ముందు ఉన్న జాతీయరహదారి ఎన్‌హెచ్-4వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.