నిబంధనలకు విరుద్ధంగా మంత్రుల యాత్రలు
సీఎం అనుమతి లేనిదే విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సర్కులర్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు నిబంధనలు పాటించకుండా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి సీఎం, సాధారణ పరిపాలన శాఖ అనుమతి లేకుండా మంత్రులు, అధికారులు విదేశీ యాత్రలకు వెళ్లరాదని స్పష్టం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు.
విదేశీ పర్యటనలకు ప్రస్తుత నిబంధనలు పాటించడంతోపాటు అదనంగా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ముఖ్యమంత్రితో ఆమోదం తీసుకోవాలని అందులో స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ఉన్నతాధికారులు 125 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చారని, ఆ పర్యటనల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్ల వ్యయం అయ్యిందే తప్ప ప్రయోజనం లేదని ‘సాక్షి’ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి విదేశీ పర్యటనలను నియంత్రించేందుకు సర్క్యులర్ మెమో జారీ చేసింది.