గాడిదలు కాసేందుకు వెళ్లావా..
ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన మంత్రి సూరకె
వ్యతిరేకిస్తూ నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలు
అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి
బెంగళూరు: ‘ఇక్కడ గొడవ జరుగుతుంటే ఎక్కడి వెళ్లావ్.. గాడిదలు కాసేందుకు వెళ్లావా..?’ అంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె ఓ ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించారు. వివరాలు... మంత్రి వినయ్‌కుమార్ సూరకె హావేరి ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఆయన పర్యటనను నిరసిస్తూ స్థానిక బీజేపీ నేతలు నల్లజెండాలతో ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘కిస్ ఆఫ్ లవ్’ అనుమతికి సంబంధించి కొద్ది రోజుల క్రితం మంత్రి వినయ్‌కుమార్ సూరకె, ఎంపీ శోభాకరంద్లాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యకర్తలు ఆయన్ను ఘెరావ్ చేశారు. దీంతో మంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ స్థానిక ఎస్ఐపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘నేను నగరంలో పర్యటనలో ఉన్న విషయం మీకు తెలియదా? ఇక్కడ వీళ్లు నా పర్యటనను అడ్డుకుంటుంటే, గొడవ జరుగుతుంటే ఎక్కడికి వెళ్లావ్? గాడిదలు కాసేందుకు వెళ్లి వస్తున్నావా’ అంటూ మండిపడ్డారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ‘సార్ కాస్తంత గౌరవంగా మాట్లాడండి సార్’ అనడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో బీజేపీ నేతలు మంత్రి తీరును ఖండిస్తూ మరింత పెద్దపెట్టున నినాదాలు చేయడంతో వినయ్ కుమార్ సూరకె అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.