మంత్రులకు పరీక్ష
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గ సభ్యుల పనితీరును బేరీజు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. విధి విధానాలను నిర్ణయించిన అనంతరం పనితీరును లెక్కగడతామని చెప్పారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం తన నివాసంలో ఆయనను పలువురు అభినందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం పెను బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు సిద్ధరామయ్య, ఎస్ఆర్. పాటిల్ సహా నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి శాయశక్తులా కృషి చేశారని ప్రశంసించారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నట్లు వెల్లడించారు. తనను ఉప ముఖ్యమంత్రిని చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తనకు ఆ పదవి ఇవ్వాలన్నది కార్యకర్తల అభిమతమని ఆయన చెప్పారు.