మంత్రివర్గంలో నూతన మార్పులు షరామామూలే
గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటిన్నర దశాబ్దం పాటు నరేంద్రమోదీ పాటిస్తూవచ్చిన విధానం కొనసాగింపే ప్రస్తుత మంత్రివర్గ మార్పులోనూ కనిపించింది. తనకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న కొన్ని నిర్దిష్టమైన పోర్ట్‌ఫోలియోలను మోదీ ఎంచుకుంటారు. సీనియర్ నేతకు కాకుండా ఒక జూనియర్ మంత్రికే వాటి బాధ్యతను అప్పగిస్తారు. ఇతడు నేరుగా మోదీకి లేదా ఆయన కింద పనిచేసే కొద్దిమంది ఉన్నతాధికారుల బృందానికి నివేదిస్తుంటారు. పాలసీలో తాను చేయాలని భావించిన మార్పులకు ఎలాంటి ప్రతిఘటనా ఎదురు కాకూడదన్నది మోదీ భావన.
మంత్రుల పనితీరు ప్రాతిపదికన వారికి రేటింగ్ ఇవ్వవలసిందిగా వార్తా చానళ్లు తరచుగా నన్ను అడుగుతుంటాయి. చాలామంది మంత్రుల విజయాలతో కూడిన ఒక పేరా లేదా అంతకంటే ఎక్కువ సమాచారాన్ని చానళ్లు పంపుతుంటాయి. ఒక్కో మంత్రికీ వాటి ఆధారంగా ఒక్కొక్కరు తమ స్కోరును ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు, ఇతరులు ఏ ర్యాంకులు ఇచ్చిందీ నేను చూడగలను.
కేంద్ర మంత్రి వర్గంలో నలుగురు మంత్రులు నిలకడగా అత్యున్నత ర్యాంకులు పొందుతున్నారు. వారు పీయూష్ గోయెల్ (విద్యుత్, బొగ్గు, నూతన శాశ్వత ఇంధన వనరులు), నిర్మలా సీతారామన్ (వాణిజ్యం, పరిశ్రమలు), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం, సహజవాయువు), ప్రకాశ్ జవదేకర్ (పర్యావ రణం). వీరికి సంబంధించి అసాధారణమైన విషయం ఏమిటంటే, వీరందరూ సహాయ మంత్రులే. అంటే వీరు జూనియర్ మంత్రులు. కేబినెట్ ర్యాంకు లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఈ వాస్తవం మారలేదు. చాలామంది మంత్రులను తీసుకున్నారు. అయితే ఒకే ఒక్కరికి సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి కలిగించారు. ఆయనే ప్రకాశ్ జవదేకర్. ప్రమోషన్ ఇచ్చారు కాని పోర్ట్‌ఫోలియో మారింది. విద్యాశాఖ మంత్రి అయ్యారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖల నూతన మంత్రి అనిల్ మాధవ్ దేవ్. జవదేకర్లాగే ఈయనా కేబినెట్ మంత్రి కాదు. సహాయ మంత్రి మాత్రమే. గుజరాత్ సీఎం అయ్యాక మోదీ పాటించిన దాని కొనసాగింపే ప్రస్తుత మంత్రి వర్గ మార్పులోనూ కనిపించింది.
తనకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న కొన్ని నిర్దిష్టమైన పోర్ట్‌ఫోలియోలను మోదీ ఎంచుకుంటారు. వాటిని సీనియర్ నేతకు అసలు అప్పగించరు. ఒక జూనియర్ మంత్రికి ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఇతడు నేరుగా మోదీకి లేదా ఆయన కింద పనిచేసే కొద్దిమంది ఉన్నతాధికారుల బృందానికి నివేదిస్తుంటారు. మొదటిసా రిగా నేను గుజరాత్లో దీన్ని గమనించాను. అప్పట్లో మోదీ ప్రధానంగా ఇద్దరు మంత్రులతోటే వ్యవహరించేవారు. వారెవరంటే సౌరభ్ పటేల్, అమిత్ షా. మోదీ సీఎంగా ఉన్న పన్నెండేళ్ల కాలంలో సౌరభ్ పటేల్ పరిశ్రమలు, గనులు, ఖనిజాలు, పెట్రోకెమికల్స్, రేవులు, ఇంధన శాఖల మంత్రిగా పనిచేశారు.
భారత్‌లోనే అత్యంత పారిశ్రామిక ప్రాంతమైన గుజరాత్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇవి చాలా కీలక మంత్రిత్వ శాఖలు. పటేల్ పోర్ట్‌ఫోలియోలు టాటా, ఎస్సార్, అదాని, అంబానీ, టొరెంట్ అనే అయిదు ప్రముఖ కంపెనీల వ్యాపార ప్రయోజనాలతో వ్యవహరిస్తుండేవి. మోదీ లక్ష్యం.. మహాభారతంలో ఐదుగురు భర్తలను సంతో షపెట్టే ద్రౌపది వ్యవహారంతో సరిపోలి ఉండేదని గుజరాత్ మీడియా హాస్యా స్ఫోరకంగా అప్పట్లో ప్రస్తావించేది. సౌరభ్ నిర్వహిస్తున్న పోర్ట్‌ఫోలియోలు ముఖ్యమైనవే అయితే (స్పష్టంగానే అవి కీలకమైనవి) ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే.. నా అభిప్రాయంలో ఈ మంత్రిత్వ శాఖలలో జరిగే కీలక నిర్ణయ ప్రక్రియపై సంపూర్ణ నియంత్రణను అట్టిపెట్టుకోవాలని మోదీ భావించి ఉండవచ్చు. నాడు గుజరాత్లో మంత్రులందరూ ముఖ్యమంత్రికి నేరుగా నివేదించినట్లే నేడు ఢిల్లీలో ప్రధానికి కేంద్ర మంత్రిమండలి నేరుగా నివేదిస్తుండటం నిజమే కావచ్చు. కేబినెట్ ర్యాంక్‌ను నిలిపివుంచడం అంటే.. కీలకమైన నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించడానికి ముందు సంబంధిత మంత్రి మోదీ కార్యాల యాన్ని తప్పక సంప్రదించవలసి ఉంటుందని అర్థం.
అలాగే గుజరాత్ కేబినెట్లో ఏళ్ల తరబడి హోంమంత్రిగా అంకితభావంతో పనిచేసినప్పటికీ అమిత్‌షాకు ఎన్నడూ మోదీ కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన పాపాన పోలేదు. మంత్రిగా నియమితుడైన నాటి నుంచి కుంభకోణం ఆరోపణలతో తప్పనిసరై పదవిలోంచి దిగిపోయేంత వరకు షా సహాయమంత్రి గానే ఉంటూ వచ్చారు. షా పోలీసు శాఖకు అధిపతి కాబట్టి అక్కడ జరుగుతున్న వాటిపై ఒక కన్నేసి ఉంచాలని మోదీ భావించారని ఊహించడం కష్టసాధ్యమేమీ కాదు.
మోదీ ప్రధాని అయ్యాక, పైన పేర్కొన్న కీలక మంత్రిత్వ శాఖలన్నింట్లోనూ సహాయ మంత్రులను నియమించడం ద్వారా వాటిపై అదేవిధమైన నియంత్ర ణను తనవద్దే అట్టిపెట్టుకుంటారని నేను ముందే ఊహించాను. కేంద్రంలోనూ హోం శాఖను కూడా మోదీ తన అదుపులోనే ఉంచుకుంటారని నేను భావించడం తప్పే. ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేబినెట్ ర్యాంకు ఇచ్చారు.
ఏమైనప్పటికీ, ఈ విషయం గురించి నేను ప్రస్తావించినప్పుడు ఒక సీనియర్ ఉన్నతాధికారి మాట్లాడుతూ కేంద్రంలో హోంశాఖ విభిన్నంగా ఉంటుందని సూచించారు. ఇక్కడ పోలీసులపై హోంమంత్రి నియంత్రణ ఉండదు. ఎందుకంటే పోలీసు శాఖ రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి ఢిల్లీలో దానికి ప్రాధాన్యత తక్కువే. పర్యావరణ మంత్రిత్వ శాఖ ముఖ్యమైనదే. ఎందుకంటే క్రియాశీలకంగా పనిచేసే మంత్రి ప్రాజెక్టులను నిరోధించగలరు. ఇలాంటి శాఖలపై నిర్వహణాత్మక అదుపు తనకే ఉండాలని మోదీ విశ్వసిస్తారు.
విధానాలలో తాను చేయాలని భావించిన అన్ని మార్పులకు ఎలాంటి ప్రతిఘటనా ఎదురు కాకూడదన్నది మోదీ భావన. అందుకే ఈ కీలక శాఖలకు చెందిన మంత్రులు ఎంత ప్రతిభావంతులైన ప్పటికీ వీరిలో ఎవరికీ కేబినెట్ ర్యాంక్ లభించదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోదీ నిష్ర్కమించిన తర్వాతే గుజరాత్లో సౌరభ్ పటేల్‌కి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇదివరకే నేను ప్రస్తావించిన పోర్ట్ట్ఫోలియోలకు చెందిన మంత్రు లకు అంతిమంగా ఇలాగే కేబినెట్ ర్యాంక్ ఇవ్వవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం పాలనలో గుజరాత్ నమూనాను నరేంద్ర మోదీ కేంద్రంలో కొంతమేరకయినా అనుసరిస్తూ వస్తున్నారన్న విషయం నాకు స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్