Ministry of Forests
-
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్‌పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
ఐదేళ్లలో 661 పులుల మృత్యువాత
సాక్షి, అమరావతి: అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏళ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు మరణిస్తున్నాయని పేర్కొంది. గత ఐదేళ్లుగా చూస్తే ఎక్కువగా పెద్ద పులుల మరణాలున్నాయని, వీటిలో ఎక్కువ శిశుమరణాలున్నట్లు గుర్తించామని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 661 పులులు మృతి చెందాయని, వీటిలో సహజ, ఇతర కారణాలతోనే 516 పులులు మృతి చెందినట్టు తెలిపింది. మరో 126 పులులను వేటాడడం ద్వారా హతమార్చారని తెలిపింది. వేటకాకుండా.. అసహజంగా 19 పులులు మరణించాయంది. పులులను వేటాడుతున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయని, అరెస్ట్‌లు చేస్తున్నాయని తెలిపింది. ప్రాజెక్టు టైగర్, టైగర్ రేంజ్ రాష్ట్రాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రాలకు నిధులిస్తున్నామని, వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
పాత విద్యుత్కేంద్రాలు మూసేయండి
* టీఎస్ జెన్కోకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం * 720 మెగావాట్ల 8 యూనిట్లు మూసేయాలని స్పష్టీకరణ * 60, 120 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు కూడా... * 2019 వరకు గడువు ఇచ్చిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. పాత సాంకేతిక పరిజ్ఞానంతో దశాబ్దాల కింద నిర్మించిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను దశల వారీగా 2018-19 లోపు మూసేయాలని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త యూనిట్ నెలకొల్పేందుకు పర్యావరణ అనుమతులు జారీ చేస్తూనే, 720 మెగావాట్ల సామర్థ్యం గల 8 పాత కేటీపీఎస్ యూనిట్లను 2018-19 లోగా మూసివేయాలని మెలిక పెట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పట్టుబట్టడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ల మూసివేతపై జెన్కో తలొగ్గక తప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో 2019 చివరి నాటికి ఈ ప్లాంట్లను మూసివేస్తామని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు గత నెల 2న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు హామీ పత్రం రాసిచ్చారు. దీంతో గత నెల 19, 20 తేదీల్లో సమావేశమైన కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కేటీపీఎస్ ఏడో దశ విస్తరణకు మరికొన్ని షరతులతో అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు వారం రోజుల్లో పర్యావరణ అనుమతుల ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కేటీపీఎస్ విద్యుత్కేంద్రం పూర్తి సామర్థ్యం 1,720 మెగావాట్లు. మరో 800 మెగావాట్లతో ఏడో దశ విస్తరణకు జెన్కో రెండేళ్లుగా పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. తొలుత 1966-67లో ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను నిర్మించి మొత్తం 240 మెగావాట్లతో జెన్కో కేటీపీఎస్‌ను నెలకొల్పింది. ఆ తర్వాత 1974-78 మధ్య కాలంలో ఒక్కొక్కటి 120 మెగావాట్లతో మరో 4 యూనిట్లను నిర్మించి 480 మెగావాట్లను జత చేసింది. తదనంతరం ఈ విద్యుత్కేంద్రం ఐదు, ఆరు దశల విస్తరణలో భాగంగా మరో 1,000 మెగావాట్లతో మూడు యూనిట్లను నిర్మించడంతో కేటీపీఎస్ సామర్థ్యం 1,720 మెగావాట్లకు పెరిగింది. 1998-2004 మధ్యలో కాలం చెల్లిన 60 మెగావాట్లు, 120 మెగావాట్ల పాత యూనిట్ల ఆధునికీకరణ కోసం రూ.604 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. భారీ పెట్టుబడి పెట్టినందున 60 మెగావాట్ల యూనిట్లను 2023-24 వరకు, 120 మెగావాట్ల యూనిట్లను 2018-19 వరకు నడపాలని జెన్కో భావించింది. ఏడో దశ విస్తరణ ప్రతిపాదనల్లో సైతం ఇదే అంశాన్ని పర్యావరణ శాఖకు తెలియజేసింది. కానీ, పర్యావరణ శాఖ ఒప్పుకోకపోవడంతో పాత యూనిట్ల మూసివేతకు జెన్కో సంసిద్ధత వ్యక్తం చేయక తప్పలేదు. కాలుష్యంపై ఆందోళన.. కేటీపీఎస్ విద్యుత్కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న బూడిద వ్యర్థాలపై పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి బూడిదలో 15.89 శాతాన్ని మాత్రమే ఇటుకలు, సిమెంట్ తయారీకి వినియోగిస్తున్నారని, 2020-21 నాటికి 100 శాతం బూడిదను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు సిమెంటు, ఇటుకల పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. కొత్త యూనిట్ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద కోసం కొత్త యాష్ పాండ్ ఏర్పాటును వ్యతిరేకించింది. పాత యూనిట్ల యాష్ పాండ్లనే కొత్త యూనిట్‌కూ వినియోగించుకోవాలని కోరింది. బూడిద కోసం కొత్తగా స్థలాలను సేకరించరాదని ఆంక్షలు విధించింది. కాలుష్య నివారణ చర్యలపై ప్రతి 6 నెలలకు ఒకసారి తెలంగాణ పీసీబీతో కలిసి పర్యవేక్షణ జరపాలని తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది.