
సాక్షి, అమరావతి: అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏళ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు మరణిస్తున్నాయని పేర్కొంది. గత ఐదేళ్లుగా చూస్తే ఎక్కువగా పెద్ద పులుల మరణాలున్నాయని, వీటిలో ఎక్కువ శిశుమరణాలున్నట్లు గుర్తించామని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.
దేశంలో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 661 పులులు మృతి చెందాయని, వీటిలో సహజ, ఇతర కారణాలతోనే 516 పులులు మృతి చెందినట్టు తెలిపింది. మరో 126 పులులను వేటాడడం ద్వారా హతమార్చారని తెలిపింది. వేటకాకుండా.. అసహజంగా 19 పులులు మరణించాయంది. పులులను వేటాడుతున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయని, అరెస్ట్‌లు చేస్తున్నాయని తెలిపింది.
ప్రాజెక్టు టైగర్, టైగర్ రేంజ్ రాష్ట్రాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రాలకు నిధులిస్తున్నామని, వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment