‘మధ్యాహ్న భోజనం’పై అసంతృప్తి
పథకంలో లోటుపాట్లు సరిచేయాలని కేంద్రం సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. మెదక్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో వంటగదులు, వాటిని నిర్మించడానికి స్థలం ఉన్నప్పటికీ, ఓ ఎన్జీవో ఏర్పాటు చేసిన సెంట్రల్ కిచెన్ నుంచి మాత్రమే మధ్యాహ్న భోజనం చేరుతోందని, ఇది కచ్చితంగా ఈ పథకం మార్గదర్శకాల ఉల్లంఘనేనని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఈ పథకం కింద పిల్లల కవరేజ్ కూడా తక్కువేనని, రెండు ఎన్జీవోలు కేంద్రీయ వంటగదుల నుంచి భోజనాన్ని సరఫరా చేస్తున్నాయంది.
పథకం కింద స్కూల్ ఆధారిత వంట గదులను, ఆ ప్రాంతంలోని ప్రజల ప్రమేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించింది. 2015-16కి గాను ఏప్రిల్- డిసెంబర్ మధ్య పథకం అమలును మంత్రిత్వశాఖ సమీక్షించింది. 30,408 వంటగదులు, స్టోర్లు మంజూరు కాగా, 25 శాతం మాత్రమే పూర్తయ్యాయని, 15,348 వంటగదులు, స్టోర్ల నిర్మాణపు పనులు ప్రారంభమే కాలేదంది. తెలంగాణలో 48 శాతం పాఠశాలలోనే ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, అన్ని పాఠశాలలకు అందించాలని శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
పిల్లల కవరేజ్ తక్కువ: రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద తెలంగాణలో పిల్లల కవరేజ్ అతి తక్కువని, నమోదైన పిల్లలలో కేవలం 69శాతం మందికే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని కేంద్రం గుర్తించింది. 58శాతం పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్(ఐఎఫ్ఏ), 14శాతం మందికి విటమిన్ ‘ఏ’, 40శాతం మందికి డీవార్మింగ్ టాబ్లెట్లు అందించారని గమనించింది. ఈ పథకం కింద మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్నిధులు12 శాతం మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.