సిరియా మంత్రివర్గంలో మార్పుచేర్పులు
రసాయన ఆయుధాలు ఉపయోగించి వేలాదిమంది ప్రాణాలు తీశారంటూ సిరియాలోని బషర్ ప్రభుత్వంపై విపక్షాల కార్యకర్తలు ఆరోపణలు చేసిన ఒకరోజు తర్వాత, అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన మంత్రివర్గాన్ని స్వల్పంగా పునర్వ్యవస్థీకరించారు. ప్రధానంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ప్రధానంగా ఆర్థిక సంబంధిత మంత్రులపైనే దృష్టిపెట్టారు. స్థానిక వాణిజ్య శాఖకు గతంలో మంత్రిగా పనిచేసిన ఖాద్రీ జమీల్‌ను ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రిగా నియమించారు. ఆయన స్థానంలో స్థానిక వాణిజ్య శాఖ మంత్రిగా సమీర్ ఇజ్జత్‌ను నియమించారు.
ఖుద్ర్ ఆర్ఫాలీ వాణిజ్యశాఖ మంత్రిగాను, కమల్ అదీన్ తౌమ్ పరిశ్రమల శాఖ మంత్రిగాను పదవులు చేపట్టారు. పర్యాటక శాఖ మంత్రిగా బిష్ర్ యజాజీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మాలెక్ అల్ అలీ బాధ్యతలు చేపట్టారు. సిరియాలో అంతర్యుద్ధం ఫలితంగా రసాయన దాడులు జరిగి, దానిలో దాదాపు 1300 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై యూనిసెఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.