ఎన్నికల విధులకు 14 ఏళ్ల కుర్రాడు!!
ఎక్కడైనా 14 ఏళ్ల కుర్రాడికి ఓటు హక్కే రాదు. అలాంటిది ఏకంగా బూత్ లెవెల్ అధికారిగా నియమితుడు కావడమంటే!! ఈ ఉదంతం హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వెలుగుచూసింది. మహ్మద్ షేక్ యూసుఫ్ (14) అనే బాలుడిని అక్కడ బీఎల్వోగా నియమించారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, మొత్తం హైదరాబాద్ లోక్సభ స్థానంలోని 1405 బీఎల్వోల నియామకంపై విచారణకు ఆదేశించారు.
ఎవరో వ్యక్తి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఇక్కడ ఉన్న బీఎల్వోలు అందరూ ఒక పార్టీకి చెందినవాళ్లేనని అతడు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు.