Minor marriage for girls
-
మైనర్ బాలికకు పెళ్లి..! ఇంకా వీడని బాల్య వివాహాల రీతి..
ఆదిలాబాద్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు వివాహం జరిపించారు. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతుల పెద్ద కూతురు (14) కాగా నిర్మల్ రూరల్ మండలంలోని గంగ, పాపయ్య దంపతుల కుమారుడు నగేశ్(33)తో ఆదివారం కొండాపూర్‌లో వివాహం జరిపించారు. బాలిక మేనమామ రాందాస్ రూ.25వేలు తీసుకుని కార్యక్రమాన్ని అంతా దగ్గరుండి జరిపించాడు. సోమవారం ఉదయం బాలిక సర్పంచ్ కనిష్ ఫాతిమాను ఆశ్రయించింది. గత జులైలో నగేశ్‌కు మొదటి వివాహం జరిగి విడాకులైంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ లక్ష్మి విశారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. సదరు బాలికను నిర్మల్ సఖీ కేంద్రానికి తరలించామన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కాసేపట్లో పెళ్లి.. నాకిప్పుడే పెళ్లి వద్దు సార్ అంటూ పోలీసులకు వీడియో!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్.. నా వయసు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా 30 ఏళ్ల యువకుడితో పెళ్లి చేసేందుకు మా ఇంట్లో సిద్ధమయ్యారు. ఇప్పుడే పెళ్లొద్దని ఎంత వారిస్తున్నా.. పట్టించుకోవట్లేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని లేకపోతే చచి్చపోతామని బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరే నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా నా పెళ్లి ఆపించండి ప్లీజ్’.. ఇదీ ఓ మైనర్ బాలిక ఆవేదన. మరికొన్ని గంటల్లో వివాహం ఉందనగా నూతన వస్త్రధారణలో ఉన్న ఓ పెళ్లి కూతురు వివాహ పత్రిక, ఆధార్ కార్డు, ముహూర్తం, పెళ్లి జరిగే ప్రాంతం తదితర వివరాలను వీడియో తీసి రాచకొండ పోలీసులకు పంపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఇరు పక్షాల కుటుంబ పెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్.. హయత్‌నగర్ ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్ నిరంజన్, ఎస్ఐ ఎన్ సూర్య, షీ టీమ్ ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ అనుష్క, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ నరేష్‌లను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించి బాల్య వివాహానికి అడ్డుకట్ట వేయడంతో కథ సుఖాంతమైంది. ఫోన్ చేస్తే అలర్ట్ అవుతారని.. వీడియో వచి్చన నంబరుకు ఫోన్ చేస్తే అమ్మాయి తల్లిదండ్రులు అప్రమత్తమవుతారని ముందుగానే గ్రహించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా పెళ్లి జరిగే చోటుకు చేరుకున్నారని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. కాగా.. మండపం నుంచి పోలీసులు వెళ్లిపోయే వరకూ పెళ్లి కూతురును బయటికి రానివ్వకుండా 2–3 గంటల పాటు గదిలోనే బంధించారు. భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు మైనర్‌ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు పెళ్లి కూతురితో ఏకాంతంగా మాట్లాడగా.. అసలు విషయం బయటకు చెప్పింది. -
మైనర్ వివాహాన్ని ఆపిన ‘దిశ’
ఆత్మకూరు: ఇష్టం లేకుండా చిన్న వయస్సులోనే వివాహ ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ బాలిక దిశ యాప్‌కు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ వివాహ ప్రయత్నాన్ని 10 నిమిషాల్లోనే నిలిపేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఎస్ఐ శివశంకర్‌రావు కథనం మేరకు.. ఆత్మకూరు మండలం అశ్వినీపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వద్దని ఇంట్లో వారిని వేడుకున్నా ససేమిరా అంటూ దూరపు బంధువుతో వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక తన స్నేహితుల ద్వారా దిశ యాప్‌ను ఆశ్రయించింది. మంగళగిరి కార్యాలయం నుంచి ఆత్మకూరు పోలీసులకు సమాచారం చేరింది. 10 నిమిషాల్లోనే పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాలికను గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు వివాహం చేయడం నేరమని, ఇలాంటివి మళ్లీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి చేత వివాహం చేయబోమని హామీ పత్రం రాయించుకున్నారు. సమయానికి దిశ యాప్ బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని గ్రామస్తులు కొనియాడారు. ఇలాంటి యాప్‌ను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. -
మైనర్ పెళ్లిని అడ్డుకున్న ‘దిశ’
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ మరో ఘనతను సాధించింది. దిశ యాప్‌కు వచ్చిన సమాచారంతో మైనర్ వివాహం ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ► విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి చేస్తున్నట్టు దిశ యాప్ ద్వారా ఆదివారం ఫిర్యాదు వచ్చింది. ► దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. రామవరం గ్రామానికి వెళ్లిన పోలీస్ రెస్క్యూ బృందం మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు సేకరించారు. ► ఆమె చదువుతున్న సర్టిఫికెట్లను పరిశీలించిన పోలీసులు, బాలికకు ఇంకా 18 ఏళ్లు నిండలేదని ధ్రువీకరించుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి ఆమె తల్లిందండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ► ఈనెల 13న ముహూర్తం ప్రకారం జరపతలపెట్టిన వివాహాన్ని రద్దు చేయాలని బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ► బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పి వివాహాన్ని పూర్తిగా రద్దు చేశారు. మైనర్‌కు పెళ్లి చేస్తే చట్టరీత్యా చర్యలు మైనర్ బాలికకు వివాహం చట్టరీత్యా నేరం. బాలికకు బలవంతంగా పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆపదలో ఉన్న మహిళలే కాకుండా మైనర్ వివాహాల వంటి వాటిపై దిశ ప్రత్యేక బృందం చర్యలు తీసుకుంటుంది. విశాఖ జిల్లాలో మైనర్‌ను స్థానిక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కేంద్రానికి తరలించి, కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించాం. – దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ -
భూమి పుత్రికలు
సురక్ష పేదింటి బాలికల పేరిట బెంగాల్ ప్రభుత్వం భూమి పట్టాలను మంజూరు చేయడంతో వారి జీవితానికి భరోసా ఏర్పడి క్రమంగా అక్కడ మైనర్ బాలికల వివాహలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలు ప్రతి ఐదుగురిలో ఒకరికి పెళ్లి జరుగుతోంది. కాదు కాదు... పెళ్లి బంధంలోకి నెట్టివేతకు గురవుతున్నారు. అది కూడా, వాళ్లకంటే పదేళ్లకు పైగా వయసున్నవారు తాళి కడుతున్నారు. ఇది పశ్చిమబెంగాల్లోని మారుమూల గ్రామాల దుఃస్థితి. చిన్న వయసులోనే పెళ్లి... కుటుంబభారం, గర్భం మోయడం, పిల్లల్ని కనడం – ఈ చట్రంలో బందీలవుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడంతో పిల్లల్ని కనలేకపోవడం, కన్నా ఆ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం... ఇదీ పరిస్థితి. యునిసెఫ్ సర్వే చేసి నివేదిక ప్రకటించే వరకు అక్కడి గ్రామీణ మహిళ జీవితం ఇంతే. బాలికల విద్య, ఆరోగ్యం మీద సర్వే చేసిన యునిసెఫ్ పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామాలు తీవ్రమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాయని, ఆ ప్రభావం బాలికలు, మహిళల మీద పడుతోందని తెలిపింది. చదువులేకపోవడం, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, లైంగిక హింస, ట్రాఫికింగ్ భూతాల నడుమ మహిళలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని నివేదిక హెచ్చరించింది. యునిసెఫ్ హెచ్చరికతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిద్ర లేచింది. ఎందుకిలా జరుగుతోందని ఆరాలు తీసింది. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ మగపెళ్లి వారు ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తారు. చిన్న పిల్ల అయితే తక్కువ కట్నంతో చేసుకుంటారు, కొంతమంది కట్నం లేకుండానూ చేసుకుంటారు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... స్కూలుకు పోతున్న అమ్మాయిని ఇంట్లో కూలేసి, పుస్తకాలు అటకెక్కించి, పుస్తెల తాడు మెళ్లో వేస్తున్నారు. అత్తవారింటికి పంపేసి తమ బరువు తీరిందని, తల్లితండ్రులుగా తమ బాధ్యతను కచ్చితంగా నిర్వర్తించామని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ ధోరణి ఇలాగే కొసాగితే ఆడపిల్లకు భవిష్యత్తే ఉండదని, ఏదో ఒకటి చేయకపోతే జరిగే అనర్థానికి కొన్ని తరాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తలచిన బెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఒక చిన్న ప్రయత్నంతో... ఈ సమస్యకు పెద్ద పరిష్కారం చూపించింది. దాంతో ఇప్పుడు ఆ గ్రామాల్లో బాలికల ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి. నిజానికి ఈ అద్భుతం జరగడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా చిన్నదే. అయితే అది వైవిధ్యమైంది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వ్యవసాయం మీద ఆధారపడిన భూమిలేని పేదవారికి పంపిణీ చేయడం మామూలుగా జరిగేపని. ఇప్పుడు ఆ భూములను బాలికలకు ఇస్తున్నారు. వారి పేరుతోనే పట్టాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో వారికి శిక్షణ ఇప్పించి, మెలకువలు నేర్పే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు బాలికలున్న ప్రతి ఇంటి పెరడూ కూరగాయల మొక్కలతో పచ్చగా ఉంది. ఇంటి అవసరాలకు పోను మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఆ డబ్బును పై చదువులకు సద్వినియోగం చేసుకుంటు న్నారు. ఒకప్పుడు ఆ గ్రామాల్లో ఆడపిల్ల అంటే తల మీద భారం అన్నట్లు ఉండేవారు తల్లితండ్రులు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... పెళ్లి చేసి భారాన్ని వదిలించుకున్నట్లు భావించేవారు. ఇప్పుడా గ్రామాల్లో తల్లిదండ్రులకు ఆడపిల్ల అంటే ఖర్చు కాదు... ఆస్తి! కట్నం కోసం కష్టపడక్కర్లేదు. కట్నం డబ్బు అల్లుడి దోసిట్లో పోసి తమ బిడ్డకు వేళకింత కడుపునిండా తిండి పెట్టమని వేడుకోవాల్సి అగత్యం లేదిప్పుడు. అమ్మాయి భూమి మీద హక్కు ఎప్పటికీ ఆ అమ్మాయిదే. తాను కడుపు నిండా తినగలుగుతుంది. నలుగురికి అన్నం పెట్టగలుగుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డల్ని కనగలుగుతుంది.