ప్రతీకాత్మక చిత్రం
ఆత్మకూరు: ఇష్టం లేకుండా చిన్న వయస్సులోనే వివాహ ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ బాలిక దిశ యాప్‌కు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ వివాహ ప్రయత్నాన్ని 10 నిమిషాల్లోనే నిలిపేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివశంకర్‌రావు కథనం మేరకు.. ఆత్మకూరు మండలం అశ్వినీపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వద్దని ఇంట్లో వారిని వేడుకున్నా ససేమిరా అంటూ దూరపు బంధువుతో వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక తన స్నేహితుల ద్వారా దిశ యాప్‌ను ఆశ్రయించింది.
మంగళగిరి కార్యాలయం నుంచి ఆత్మకూరు పోలీసులకు సమాచారం చేరింది. 10 నిమిషాల్లోనే పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాలికను గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు వివాహం చేయడం నేరమని, ఇలాంటివి మళ్లీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి చేత వివాహం చేయబోమని హామీ పత్రం రాయించుకున్నారు. సమయానికి దిశ యాప్ బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని గ్రామస్తులు కొనియాడారు. ఇలాంటి యాప్‌ను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment